యాదాద్రి రోడ్డు విస్తరణలో భాగంగా ఇల్లు, స్థలాలు కోల్పోతున్న వారు ఏమాత్రం అధైర్య పడొద్దని ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ 2016లో ఇచ్చిన హామీ మేరకు.. ప్రతీ బాధితునికి అండగా ఉంటామని స్పష్టం చేశారు. 28మంది నిర్వాసితులకు రూ.3కోట్ల విలువ గల.. మంజూరు పత్రాలను అందజేశారు. ప్రతిపక్ష నాయకులు ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నారని ఆమె మండిపడ్డారు.
సుమారు 70మంది బాధితులు.. వారి ఇళ్లు, స్థలాలను ఇవ్వటానికి స్వచ్ఛందంగా ముందుకొచ్చారని ఎమ్మెల్యే ఆనందం వ్యక్తం చేశారు. వారందరికీ మున్సిపాలిటీ పరిధిలోనే స్థలాల కేటాయింపులు జరుపుతామని స్పష్టం చేశారు.
అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దుతున్న యాదాద్రి ఆలయ అభివృద్ధిలో.. ఆ మాత్రం నష్టం సహజమన్నారు ఎమ్మెల్యే. రానున్న రోజుల్లో స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని.. బాధితులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, పురపాలక కమిషనర్ రజిత, మున్సిపల్ ఛైర్మన్ సుధా, వైస్‌ఛైర్మన్ కాటంరాజు, యాదగిరిగుట్ట తహసీల్దార్ అశోక్‌రెడ్డి, జడ్పీటీసీలు, వార్డు కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: భూమి తీసుకున్నారు కానీ ఉద్యోగం ఇవ్వలేదని నిరుద్యోగి ఆత్మహత్య