Crowd at Yadadri temple: యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. స్వామివారి దర్శనానికి భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ఆలయ పరిసరాలు, ఘాట్ రోడ్డు వాహనాలతో పూర్తిగా రద్దీగా మారింది. దీంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడి రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. కొండపైకి చేరవేసేందుకు ఉచిత బస్సులు ఉన్నప్పటికీ.. అవి సరిపోవడం లేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిమితికి మించి భక్తులను బస్సుల్లో ఎక్కించుకుంటున్నారని మండిపడుతున్నారు.
తిరుమల తరహాలో ఏర్పాట్లు: మరోవైపు యాదాద్రి దర్శనం.. తిరుమల తరహాలో కల్పించేందుకు ఆలయ అధికారులు ప్రయోగాత్మకంగా చర్యలు చేపట్టారు. కొండపై ఉచిత దర్శన వరుసల కాంప్లెక్స్ నుంచి ఆలయ మాడ వీధి మీదుగా భక్తులను వరుస క్రమంలో తరలించే ప్రక్రియను చేపట్టారు. దర్శనానికి వేచి ఉండే భక్తులతో ఉచిత, ప్రత్యేక వరుసలు నిండిపోయి.. ఇక్కట్లు ఎదురవుతున్నాయి.
క్యూ కాంప్లెక్స్ నింపని పక్షంలో ఒకేసారి అధిక సంఖ్యలో భక్తులు ఆలయంలోకి వచ్చి చేరుతున్నారని ఆలయ అధికారులు తెలిపారు. క్యూలైన్లో నింపి.. కొద్ది కొద్ది మందిని వదలడం వల్ల దర్శనానికి వెసులుబాటు కలుగుతుందని.. సీఎం కేసీఆర్ సూచనలతో దర్శనం సులువుగా సాగేలా శ్రీకారం చుట్టినట్లు ఆలయ ఈవో గీతారెడ్డి తెలిపారు.
ఇవీ చదవండి: