CM KCR visit to Yadadri: విశ్వఖ్యాతి చెందేలా పునర్నిర్మితమైన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం మహాకుంభ సంప్రోక్షణపై ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి సారించారు. చినజీయర్ స్వామి ఖరారు చేసిన ముహూర్తం ప్రకారం మార్చి 28న గర్భాలయంలోని స్వయంభువుల నిజ దర్శనాలను భక్తులకు కల్పించాలన్నదే కేసీఆర్ సంకల్పం. ఆ మేరకు క్షేత్రాభివృద్ధి పనులను ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గతేడాది అక్టోబరు 19న ఈ క్షేత్రాన్ని సందర్శించి వెళ్లాక పనుల పురోగతిపై సమగ్ర నివేదికను తెప్పించుకోవాలనుకుంటున్నారు. అందుకు ఈ వారంలో మంత్రులు ప్రశాంత్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి యాదాద్రికి రావొచ్చని యాడా అధికారులు చెబుతున్నారు. మంత్రులు ఇచ్చే నివేదిక ఆధారంగా మిగులిన పనుల పూర్తికి దిశానిర్దేశం చేసేందుకు.. సంక్రాంతి తర్వాత ముఖ్యమంత్రి ఇక్కడికి రానున్నట్లు సమాచారం. ఉద్ఘాటనకు ముందస్తు చేపట్టే మహాయాగానికి వనరులు, రుత్వికుల బస ఏర్పాట్లు. దేశవ్యాప్తంగా ఉన్న స్వామీజీలను ఆహ్వానించడంపై కేసీఆర్ చర్చించనున్నారు.
ఫిబ్రవరిలోగా
ఈమేరకు కొండపైన కట్టడాలన్నింటినీ ఫిబ్రవరిలోగా పూర్తి చేసేందుకు అధికారులు శ్రమిస్తున్నారు. బస్ బే, కమాండ్ కంట్రోల్ రూం, భారీ స్వాగత తోరణంతో సహా దర్శన వరుసల సముదాయంలో సదుపాయాల కల్పన పనుల తీరును పరిశీలించి సీఎంకు నివేదిక అందజేసేందుకు మంత్రులు రానున్నారు. ఆలయ గోపురాలపై స్వర్ణ కలశాల స్థాపనకు ముందస్తుగా మహా రాజగోపురానికి సంబంధించి పలు పనులను పరిశీలించేంచుకు త్వరలోనే ఒక ప్రత్యేక బృందం రానుంది. ఆ బృందం నిర్ణయించాకే కలశాల స్థాపనకు శ్రీకారం చుడతారు.
స్వామి సేవలో కేంద్ర మంత్రి
యాదాద్రి నారసింహుని కేంద్ర రసాయన, ఎరువుల శాఖ మంత్రి భగవంత్ ఖుబా దర్శించుకున్నారు. కుటుంబసమేతంగా యాదాద్రీశుని దర్శించుకున్న కేంద్ర మంత్రి.. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. దేశప్రజలంతా సుఖశాంతులతో, పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. అనంతరం ప్రధాన ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించారు. రానున్న రోజుల్లో యాదాద్రి గొప్ప పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతుందని ఆయన ఆకాంక్షించారు. స్వామివారి దర్శనం తన జీవితంలో మర్చిపోలేని ఘట్టంగా పేర్కొన్నారు.
స్వామి దర్శనానికి భక్తుల రద్దీ
Devotees rush at yadadri: వరుస సెలవులు కావడంతో యాదాద్రీశుని దర్శనానికి భక్తులు పోటెత్తారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారి దర్శనానికి తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. స్వామి వారి ధర్మ దర్శనానికి రెండు గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు గంట సమయం పడుతోంది.
సుప్రభాత సేవ
ఆలయ అర్చకులు స్వామి వారికి నిత్య పూజలు, హోమాదిపర్వం, కల్యాణోత్సవం నిర్వహించారు. వేకువజామున సుప్రభాతం చేపట్టిన పూజారులు.. బాలాలయంలోని పంచనారసింహులకు హారతి నివేదించారు. భక్తులు కుటుంబ సమేతంగా సత్యనారాయణ స్వామి వ్రత పూజల్లో పాల్గొని, దీపారాధన చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అభివృద్ధి పనుల దృష్ట్యా కొండపైకి పోలీసులు వాహనాలను అనుమతించడం లేదు.
ఇదీ చదవండి: Gold Donation for Yadadri Temple : యాదాద్రికి వెల్లువెత్తిన విరాళాలు.. ఒంటిపై నగలు ఇచ్చిన మంత్రి సత్యవతి