Brahmotsavam ended in Yadadri: తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి సన్నిధిలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ముగిశాయి. ఫిబ్రవరి 21వ తేదీన స్వస్తివాచనంతో ప్రారంభమైన ఈ వార్షిక బ్రహ్మోత్సవాలు పదకొండు రోజుల పాటు కొనసాగి.. గత రాత్రి శృంగార డోలోత్సవంతో ముగిశాయి. శుక్రవారం రాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లను వివిధ రకాల పుష్పాలతో నయన మనోహరంగా, వజ్ర వైడూర్యాలతో అలంకరించారు.
ఈ వేడుక కోసం ఆలయ ప్రాకార మండపం పూలతో అలంకరించారు. అనంతరం అద్దాల మండపంలోని ఊయలలో స్వామివారిని ఉంచారు. అనంతరం ఆలయ అర్చకులు వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ప్రత్యేక పూజలు చేసి డోలోత్సవ కార్యక్రమం నిర్వహించి వార్షిక బ్రహ్మోత్సవాలు ముగించినట్లు ప్రకటించారు. వార్షిక బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన వేడుక డోలోత్సవ వేడుక అని ఆలయ అర్చకులు తెలిపారు. కార్యక్రమం విశిష్టతను భక్తులకు తెలియజేసారు. హైదరాబాద్కు చెందిన కొందరు భక్తులు స్వామివారిని కీర్తిస్తూ పాటలు పాడి భక్తులను ఆలరింప చేశారు.
వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి వారు రోజుకో అవతారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. రోజు వారి కార్యక్రమాల్లో భాగంగా ఆలయ అర్చకులు స్వామి కల్యాణ ఘట్టం, ఎదుర్కోలు కార్యక్రమం, స్వామి వారి రథత్సోవం ఇలా రోజుకో కార్యక్రమం నిర్వహించారు. భక్తులకు స్వామి వారి అవతారం వారి విశిష్టతను తెలియ జేశారు. ఈ కార్యక్రమాల్లో అధిక సంఖ్యలో భక్తులతో పాటుగా ప్రభుత్వ పెద్దలు పాల్గొనేవారు. స్వామి వారి కల్యాణ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ సతీమణి పాల్గొన్నారు.
యాదాద్రి ఆలయ పునర్ నిర్మాణం తరువాత తొలిసారిగా జరిగిన వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఎలాంటి సేవాలోపం లేకుండా ఆలయ అధికారులు ప్రత్యేక జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకున్నారు. పటిష్ఠ పోలీసు బందోబస్తు మధ్య వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించారు.
స్వామివారి సేవలో ఎలక్షన్ కమిషనర్: తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ సి.పార్థ సారధి కుటుంబ సమేతంగా శుక్రవారం యాదాద్రీశ్వరుడిని దర్శించుకున్నారు. సువర్ణ పుష్పార్చన పూజల్లో పాల్గొని స్వామి వారి మొక్కులు చెల్లించుకున్నారు. ముందుగా ఆయనకు ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక ఆశీర్వచనాలు చేశారు. అనంతరం స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు.
ఇవీ చదవండి:
యాదాద్రిలో కన్నుల పండువగా స్వామి వారి కల్యాణం.. పాల్గొన్న సీఎం సతీమణి
యాదాద్రిలో ఘనంగా రథోత్సవం.. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తజనం
యాదాద్రిలో ఘనంగా ఎదుర్కోలు మహోత్సవం.. నేడే స్వామి వారి కల్యాణం