యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం మర్యాల నుంచి చీకటిమామిడి వరకు 10 కిలోమీటర్ల మేర జిల్లా భాజపా నేతలతో కలిసి భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బండ్రు శోభారాణి, భాజపా జిల్లా అధ్యక్షుడు శ్యాంసుందర్ పాదయాత్ర చేశారు. ఈ మార్గంలో రహదారి పూర్తిగా ధ్వంసమై నడవడానికి వీలులేకుండా తయారయిందని మండిపడ్డారు. ఈ రహదారిని పునర్నిర్మించాలని డిమాండ్ చేశారు.
స్వరాష్ట్రం వచ్చినా.. గ్రామాల్లో ప్రజల ఇబ్బందులు అలాగే ఉన్నాయని శోభారాణి మండిపడ్డారు. సీఎం కేసీఆర్ ఫాం హౌస్‌కు పక్కనే ఉన్న మర్యాల-చీకటిమామిడి రోడ్డును ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ కుటుంబం మొత్తం కమీషన్లకు కక్కుర్తి పడుతున్నారని, కమీషన్లు వచ్చే పనులు మాత్రమే చేస్తూ గ్రామాలను, గ్రామాలను అనుసంధానం చేసే రోడ్లను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
2018 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో.. తనను గెలిపిస్తే రెండు నెలల్లోనే మర్యాల-చీకటిమామిడి మధ్య రోడ్డు వేయిస్తానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే గొంగిడి సునీత గెలవగానే ఈ విషయాన్నే మర్చిపోయారని విమర్శించారు.
- ఇవీచూడండి: యువకుడి మృతి... కార్పొరేటర్‌పై బంధువుల దాడి