Bandi Sanjay Comments: సీఎం కేసీఆర్.. నెంబర్ వన్ తెలంగాణ ద్రోహి అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దుయ్యబట్టారు. మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని యాదాద్రి భువనగిరి జిల్లాలోని భూదాన్ పోచంపల్లిలో ఏర్పాటు చేసిన చేనేత కార్మికుల సమ్మేళనంలో సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతన్నలకు చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెరాస ప్రభుత్వంలో చేనేత పరిశ్రమ నిర్వీర్యమైందని బండి సంజయ్ ఆరోపించారు. తమ ఆశీర్వాదంతో రాష్ట్రంలో భాజపా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మరమగ్గాలకు జియో ట్యాగింగ్ ఏర్పాటు చేస్తామని బండి సంజయ్ తెలిపారు. చేనేత వస్త్రాలను కొనుగోలు చేయటమే కాకుండా... ఇళ్లు లేని అర్హులైన నేతన్నలకు ఇళ్లు నిర్మించి ఇస్తామని బండి సంజయ్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు భాజపా తీర్థం పుచ్చుకున్నారు.
"చేనేత దినోత్సవం సందర్భంగా చేనేతలకు కేసీఆర్ కనీసం శుభాకాంక్షలు చెప్పలేదు. కేసీఆర్ నెంబర్ వన్ తెలంగాణ ద్రోహి. రాష్ట్రంలో బీసీలకు ప్రాధాన్యం లేదు. కొండా లక్ష్మణ్ బాపూజీని కనీసం గుర్తుంచుకోలేదు. ప్రజాసంగ్రామ యాత్ర ఎందుకని తెరాస నాయకులు అడుగుతున్నారు.. రాష్ట్రంలో కేసీఆర్ తిరిగితే.. మేం ఎందుకు తిరుగుతాం. చేనేత కుటుంబాల్లో ఎంత మందికి ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి ఇచ్చారో చెప్పాలి. నీతి ఆయోగ్ సమావేశానికి పోకుండా కేసీఆర్.. ఆ సంస్థను విమర్శిస్తున్నారు." - బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు
మరోవైపు.. సభ జరుగుతున్న సమయంలో ఓ వ్యక్తి పెట్రోల్ సీసాతో హల్‌చల్ చేశాడు. పెట్రోల్ బాటిల్ పట్టుకుని స్టేజ్ ఎక్కేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించాడు. వెంటనే అతన్ని అడ్డుకున్న భాజపా కార్యకర్తలు.. పెట్రోల్ బాటిల్ లాక్కొని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనతో అక్కడ కాసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది.
ఇవీ చూడండి: