BJP Public Meeting Cancelled: ఈ నెల 31న మునుగోడులో నిర్వహించనున్న భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా భారీ బహిరంగ సభ రద్దయింది. బహిరంగ సభకు ప్రత్యామ్నాయంగా మండలాల వారీగా సభలను నిర్వహించాలని యోచిస్తోంది. 31వ తేదీతో పాటు ప్రచార పర్వం.. చివరి రోజైన నవంబర్ 1న నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో సభలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ సభలకు అస్సాం ముఖ్యమంత్రి హేమంత బిశ్వ శర్మ, కేంద్ర మంత్రులు స్మృతీ ఇరానీ, నిర్మలా సీతారామన్.. యువ మోర్ఛా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ తేజస్వి సూర్యతో పాటు ముఖ్య నేతలను రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
ఒక్కో మండలానికి ఒక్కో కీలక నేత: ఒక్కో మండలానికి ఒక్కో కీలక నేత ప్రచారానికి వెళ్లనున్నారు. వీరితో పాటు రాష్ట్రానికి చెందిన కిషన్‌రెడ్డి, లక్ష్మణ్, బండి సంజయ్, డీకే అరుణ, ఈటల రాజేందర్ ముఖ్య నేతలతో కలిసి ఒక్కో సభలో పాల్గొనేలా ప్రణాళికలు చేస్తోంది. తొలుత బైక్ ర్యాలీలు నిర్వహించిన అనంతరం సభలు నిర్వహించనున్నారు. మునుగోడు ఉపఎన్నికకు సమయం ఆసన్నమవుతున్న నేపథ్యంలో.. భారీ బహిరంగ సభ పెద్దగా ప్రభావం చూపకపోవచ్చనే ఉద్దేశ్యంతో.. మండలాల వారీగా సభలు ఏర్పాటు చేయాలని కాషాయదళం నిర్ణయానికి వచ్చింది.
మండలాల వారీగా సభలు: ఇలా అయితే స్థానికంగా ఉన్న ఓటర్లను మరింతగా ప్రభావం చేస్తోందని భావిస్తోంది. మునుగోడు ఉపఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారడంతో కేంద్ర మంత్రులను ప్రచారంలోకి దించాలని భాజపా జాతీయ నాయకత్వం నిర్ణయించింది. మండలాల వారీగా సభలు నిర్వహిస్తున్న నేపథ్యంలో జన సమీకరణ చేపట్టడంపై కాషాయదళం కసరత్తులు మొదలెట్టింది. ఒక్కో మండలంలో కనీసం 25వేల మందితో సభ నిర్వహించాలని ప్రణాళికలు రూపొందిస్తోంది.
యువ ఓటర్లు కీలకం: ఉపఎన్నిక సమీపిస్తున్న వేళ కమలనాథులు తమ పంథాను మార్చుకుని సరికొత్త రూట్లో వెళ్తుండటంతో.. గెలుపు పక్కా అన్న ధీమాతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మండలాల వారీగా యువతను భారీగా తీసుకొచ్చి బైక్ ర్యాలీలు నిర్వహించేందుకు ప్రణాళికలు చేస్తోంది. యువతే లక్ష్యంగా తేజస్వి సూర్యతో ప్రచారం హోరెత్తించనున్నారు. ఈ ఉపఎన్నికల్లో యువ ఓటర్లు కీలకంగా మారుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
నేడు రాష్ట్రానికి తరుణ్ చుగ్: మునుగోడు నియోజకవర్గంలో ప్రచారంలో పాల్గొనేందుకు భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ నేడు రాష్ట్రానికి రానున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో కలిసి సుడిగాలి పర్యటనలు చేయనున్నారు. ప్రజల్లో పార్టీకి మద్దతు ఎలా ఉందన్న విషయంపై ఆరా తీయనున్నారు. సభల నిర్వహణ నేపథ్యంలో ఆయా మండలాల వారీగా జన సమీకరణపై దృష్టి సారించనున్నారు. మునుగోడులో భాజపా వాస్తవ పరిస్థితిపై సమీక్ష నిర్వహిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.
ఇవీ చదవండి: Munugode Bypoll: హైదరాబాద్‌లో మునుగోడు భవితవ్యం... ఆ ఓటర్లే కీలకం!
'ఉచితాలను నియంత్రించే అధికారం ఈసీకి లేదు'.. ఎన్నికల్లో వాగ్దానాలపై కాంగ్రెస్