భువనగిరి ఖిల్లా మరో సాహస క్రీడకు నాంది కాబోతోంది. ప్రస్తుతం పర్వతారోహణ జరుగుతున్న ప్రాంతంలో కోటకు ఇరువైపులా ఎత్తైన రాళ్లను తీగతో అనుసంధానం చేసి జిప్‌లైన్ అనే సాహస క్రీడ నిర్వహణకు రాష్ట్ర సర్కార్ ఏర్పాట్లు చేస్తోంది. అహ్మదాబాద్‌కు చెందిన నీరట్కుమార్ భట్ బృందం దీనికి సంబంధించిన పనులు ప్రారంభించింది.
జిప్‌లైన్ సాహస క్రీడ
ఇప్పటికే భువనగిరి కోటపై భువనగిరి రాక్ క్లైంబింగ్ స్కూల్ పేరుతో ఓ ప్రైవేటు శిక్షణా సంస్థ ఆధ్వర్యంలో రాక్ క్లైంబింగ్ (తాడు సాయంతో కొండ పైకి ఎక్కడం), ర్యాప్లింగ్ (తాడు సాయంతో కొండపై నుంచి కిందకు దిగడం)వంటి అంశాల్లో శిక్షణ ఇస్తోంది. ఇకపై రాక్ క్లైంబింగ్‌తో పాటు జిప్ లైన్ అనే సాహస క్రీడలోనూ పాల్గొనేందుకు పర్యటకులకు అవకాశం కలగనుంది.
నిర్మాణం ప్రారంభం
జిప్ లైన్ 200 అడుగుల పొడవుతో నిర్మాణం మొదలైంది. జిప్ లైన్ నిర్మాణానికి రెండు వైపులా బండరాళ్లను లోతుగా తొలిచి తీగ బిగిస్తారు. రెండింటి మధ్య సుమారు 200 అడుగుల దూరం ఉంటుంది. తీగకు ఏర్పాటు చేసిన కదిలే పుల్లీకి క్లాంప్ బిగించి, వ్యక్తి కూర్చునేందుకు తొట్టి లాంటి బెల్టులను ఏర్పాటు చేశారు. దీన్ని తొడుక్కొని జిప్ లైన్‌పై వెళ్లాల్సి ఉంటుంది. రెండు వైపులా ఇద్దరు వ్యక్తులు ఉండి పర్యటకులను పంపించి తిరిగి దింపుతారు. దీని నియంత్రణ తాడు.. ఇద్దరు నిర్వాహకుల వద్ద ఉంటుంది.
పర్యటకుల సంతోషం
జిప్ లైన్ నిర్మాణం పూర్తయ్యాక ట్రయల్ రన్ జరిపి, సురక్షితంగా ఉందని ధ్రువీకరిస్తే పర్యటకులకు అనుమతిస్తారు. ఈ అడ్వెంచర్ పనుల ప్రారంభం పట్ల స్థానికులు, పర్యటకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.