యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం బసంతపురం గ్రామసర్పంచ్ తమను ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు సౌందర్య అనే మహిళ ఆరోపించారు. బసంతపురం గ్రామంలో తమ తండ్రికి 1996లో ప్రభుత్వం కేటాయించిన భూమిని తమది కాదంటూ సర్పంచ్ ఇతరులకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారంటూ.. పేర్కొన్నారు. తమ స్థలంలో ఉన్న గుడిసెను తొలగించి కులం పేరుతో, అసభ్య పదజాలంతో దూషించారని తెలిపింది. అణగారిన వర్గానికి చెందిన తమకు గత ప్రభుత్వం భూమిని కేటాయిస్తే సర్పంచ్ పదవిని అడ్డం పెట్టుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని మహిళ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తులమైనందునే.. తమపై సర్పంచ్ కక్షపూరితంగా వ్యవహిస్తున్నారని ఆరోపించింది. ఈ విషయంపై ఎంపీడీవోకు ఫిర్యాదు చేయడానికి వెళ్తే.. అక్కడ సర్పంచ్ వెంకట్‌రెడ్డి దురుసుగా ప్రవర్తించినట్లు చెప్పింది. తమకు గ్రామ సర్పంచ్ వెంకట్ రెడ్డి నుంచి ప్రాణహాని ఉందని తమ పోలీసులు రక్షణ కల్పించాలని కోరింది. సర్పంచ్‌పై చర్యలు తీసుకోవాలని వేడుకుంది.
గ్రామ సర్పంచ్ వివరణ...
ఈ ఘటనపై బసంతపురం గ్రామ సర్పంచ్ వెంకట్‌రెడ్డి స్పందించారు. తాను ఎవరిని ఇబ్బందులకు గురిచేయలేదని అన్నారు. ఎంపీడీవో కార్యాలయానికి వచ్చిన తనను వారే దూషించారని వెల్లడించారు. తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు.
ఇదీ చదవండి: Lock down: ఈ నెల 20 తర్వాత లాక్డౌన్ ఎత్తివేసే యోచనలో ప్రభుత్వం