Bandi Sanjay on By Elections in Telangana : భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర మూడో రోజూ కొనసాగుతోంది. గొల్లగూడెం, ముగ్దుమ్‌పల్లి, గుర్రాలదండి, బట్టుగూడెం గ్రామాల మీదుగా 11.7 కి.మీ.మేర నేడు పాదయాత్ర సాగనుంది. ఈ క్రమంలోనే భువనగిరి పట్టణంలోని జిట్టా బాలకృష్ణా రెడ్డి ఫామ్‌హౌస్‌లో బండి సంజయ్ మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో రానున్నది భాజపా ప్రభుత్వమేనని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వంలో జర్నలిస్టులకు రైల్వే పాసులు, ఇళ్లు నిర్మించి ఇస్తామని తెలిపారు. పాత్రికేయులను ఆదుకునే బాధ్యత తమదే అని.. ఆయుష్మాన్ భారత్‌లో జర్నలిస్టులను చేర్చే విషయం చర్చిస్తానని చెప్పారు.
తెలంగాణలో ఇప్పటి వరకు నాలుగు ఉప ఎన్నికల్లో రెండు గెలిచామని బండి సంజయ్ గుర్తు చేశారు. మునుగోడు ఎన్నిక తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును నిర్మించే ఎన్నికలని వ్యాఖ్యానించారు. తమతో 10, 12 మంది ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారని.. రాష్ట్రంలో ఇంకా చాలా ప్రాంతాల్లో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని బండి పేర్కొన్నారు. తెరాస నాయకులే ఉప ఎన్నికలకు కారణం కాబోతున్నారని అన్నారు. ఈ క్రమంలోనే కోమటిరెడ్డి బ్రదర్స్ చాలా సందర్భాల్లో మోదీ పథకాలను ప్రశంసించారని ఆయన తెలిపారు.
రాష్ట్రంలో ఇప్పటి వరకు నాలుగు ఉప ఎన్నికల్లో 2 గెలిచాం. 10, 12 మంది ఎమ్మెల్యేలు మాతో మాట్లాడుతున్నారు. ఇంకా చాలాచోట్ల ఉప ఎన్నికలు రాబోతున్నాయి. తెరాస నాయకులే ఉప ఎన్నికలకు కారణం కాబోతున్నారు. పార్టీలో చేరేవారికి సముచిత గౌరవం ఉంటుంది. టికెట్ల విషయంలో ఎవరికీ హామీ ఉండదు. పార్టీ నిర్ణయమే ఫైనల్. కోమటిరెడ్డి బ్రదర్స్ చాలా సందర్భాల్లో భాజపా పథకాలను ప్రశంసించారు.-బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు
పార్టీ నిర్ణయమే ఫైనల్.. ఎన్నికల వరకు తన ప్రజా సంగ్రామ యాత్ర ఉంటుందని బండి స్పష్టం చేశారు. మధ్యలో ఆపే ప్రసక్తే లేదన్నారు. ప్రజల సమస్యలను తెలుసుకోవడమే యాత్ర ముఖ్య ఉద్దేశమని.. వాటినే తమ మేనిఫెస్టోలో పెడతామని పేర్కొన్నారు. పార్టీలో అందరికీ సముచిత గౌరవం ఉంటుందన్న ఆయన.. భాజపాలో టికెట్ల విషయంలో ఎవరికీ హామీ ఉండదని.. పార్టీ నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు.
నయీం డబ్బులు ఏమయ్యాయి.. మరోవైపు రాష్ట్రంలో సంచలనం సృష్టించిన క్యాసినో స్కామ్‌లో చాలామంది తెరాస నాయకులు ఉన్నారని బండి సంజయ్ ఆరోపించారు. డ్రగ్స్ స్కామ్‌లోనూ వారే ఉన్నారన్నారు. గ్యాంగ్‌స్టర్ నయీమ్ వల్ల కేసీఆర్ కుటుంబానికి ఇబ్బంది రాగానే అతడిని ఎన్కౌంటర్ చేశారన్న బండి.. నయీమ్ డైరీ, డబ్బులు ఏమయ్యాయని ప్రశ్నించారు. నయీమ్ బాధితులను ఆదుకుంటామని.. వారికి న్యాయం చేస్తామని తెలిపారు.