Road Accidents in Telangana Today : రాష్ట్రంలో వేరు వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డుప్రమాదాల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపుర్ వద్ద ఆటో, బస్సు ఢీకొనడంతో నలుగురు మృతి చెందారు. మరో 9 మందికి గాయాలు కాగా.. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. విషయం తెలుసుకుని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. మృతులు నాగలక్ష్మి, వరకాంతం అనసూయ, ధనలక్ష్మి, దేవరపల్లి శిరీషగా గుర్తించారు. బాధితులంతా దేవాలమ్మ నాగారం గ్రామస్థులుగా తెలిపారు. వీరంతా పారిశ్రామికవాడలో పని చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Gundampally Accident News: నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్ మండలంలోని గుండంపల్లి గ్రామ ఎక్స్ రోడ్డు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీనివాస్(29), అఖిల్ (27), సతీశ్(22) అనే ముగ్గురు యువకులు దిలావర్‌పూర్ నుంచి రాంపూర్ గ్రామానికి కారులో వెళ్తున్నారు.
ఈ క్రమంలో భైంసా నుంచి నిర్మల్ వైపు వస్తున్న లారీ వేగంగా వీరు ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టింది. ప్రమాదంలో శ్రీనివాస్, అఖిల్ అక్కడికక్కడే మృతి చెందగా.. సతీశ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. ఘటనా స్థలాన్ని డీఎస్పీ జీవన్ రెడ్డి పరిశీలించారు. ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు మృత్యువాతపడటంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Moinabad Accident Today: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో ట్రాక్టర్, కారు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ట్రాక్టర్ డ్రైవర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. కారులో ఉన్న వారికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి..
ఈనెల 13న అదృశ్యమైన ప్రేమజంట.. దొరికిన ఆచూకీ.. కానీ?
Live Accident Video: స్కూటీ కంట్రోల్ తప్పి ద్విచక్రవాహనదారుడి దుర్మరణం