యాదాద్రి పుణ్యక్షేత్ర పునర్నిర్మాణంలో భాగంగా ప్రధాన ఆలయం ముందు ఏర్పాటు చేయనున్న విగ్రహాలకు మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. మహారాజసం కలిగించే రాతి బొమ్మల అమరికకు చేపట్టిన కసరత్తులో భాగంగా ఆ విగ్రహాలను మహాబలిపురం నుంచి సోమవారం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. గతంలో ఐరావతం, సింహాల విగ్రహాలు పొందుపరిచారు. వాటిని నలుదిశలా ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో మరిన్ని శిల్పాలను తీసుకొచ్చారు. ఆ శిల్పాలను ఆలయ మహా ముఖమండపం, రాజగోపురాల చెంత అమర్చేందుకు మంగళవారం శ్రీకారం చుట్టారు.

ప్రవేశ మార్గంలోని త్రితల రాజగోపురం ఎదుట, క్షేత్ర పాలకుడి మందిరం నుంచి ముఖ మండపంలోకి వెళ్లే మెట్ల మార్గంలో సింహరూపాలు పొందుపర్చనున్నారు. ఐరావతం విగ్రహాలను దక్షిణ, ఉత్తర దిశల్లోని రాజగోపురాల ఎదుట ఏర్పాటు చేయనున్నారు. ఆలయ ఉత్తర దిశలోని ప్రహరీకి ఆధ్యాత్మిక చిహ్నాలైన శ్రీశంఖు, చక్ర నామాల శిలారూపాలను అమర్చనున్నారు. యాదాద్రి అనుబంధ పర్వతవర్ధని రామలింగేశ్వరస్వామి ఆలయంలో శివాలయం ఎదుట ఐదు అడుగుల భారీ నంది విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఆలయం నలువైపులా నిర్మించిన సాలహారాలలో శ్రీకృష్ణ మహాత్యాన్ని చాటే విగ్రహాల ఏర్పాట్లపై శిల్పి ఆనందసాయి రూపొందించిన నమూనాలను జీయర్‌స్వామి ఈ నెల 7న తిలకించారు. అష్టలక్ష్మీలు, దిక్పాలకుల విగ్రహాలను కూడా ఏర్పాటు చేయాలని ఆయన సూచించినట్లు యాడా ప్రధాన స్తపతి డాక్టర్ ఆనందచారి వేలు తెలిపారు.

మూడు రోజులపాటు దైవదర్శనాలు బంద్
కొవిడ్ కట్టడిలో భాగంగా యాదాద్రిలో మూడురోజులపాటు దైవదర్శనాలను నిలిపి వేస్తున్నట్లు ఆలయ ఈవో గీతారెడ్డి మంగళవారం రాత్రి ప్రకటించారు. దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు బుధవారం నుంచి దర్శనాలు బంద్ చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను నియమించిన ప్రభుత్వం