రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏటా మార్చి నెల 15 నుంచి మొదలైన వేడుకలు పదకొండు రోజులు జరుగుతాయి. ఆలయ విస్తరణ పనుల వల్ల బ్రహ్మోత్సవాలను 2017 నుంచి వరుసగా నాలుగు సార్లు బాలాలయంలో నిర్వహించారు. ప్రస్తుతం ప్రధానాలయంతో పాటు అనుబంధ శివాలయం పునర్నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయి. కొండపై చేపట్టిన పనులన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నారు.
నాలుగేళ్లుగా బాలాలయానికే పరిమితమైన స్వామివారి ఉత్సవాలను ఈఏడాది కూడా స్వయంభువుల చెంతనే నిర్వహించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. కొండపై జరుగుతున్న పనుల ప్రగతిని సీఎంఓ భూపాల్ రెడ్డి పరిశీలించి నివేదికను సీఎం కేసీఆర్కు సమర్పించనున్నారు. దాని ఆధారంగా సీఎం యాదాద్రికి వచ్చే అవకాశం ఉంది. మార్చి రెండో వారంలో ఉత్సవాలు ప్రారంభం కాగా... 22న స్వామివారి కల్యాణం జరగనుంది. ఈసారి ఉత్సవాలను సంప్రదాయ హంగులతో నిర్వహించేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం.
ఇదీ చూడండి: తపాలా శాఖతో 'హస్తకళ'కు ప్రత్యేక గుర్తింపు: గవర్నర్