ప్రజలకు ఉపయోగపడే పనులపై సీఎం కేసీఆర్‌కు శ్రద్ధ లేదని కాంగ్రెస్ ఆలేరు నియోజకవర్గం నాయకుడు బీర్ల అయిలయ్య ఆరోపించారు. యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట మండలం చొల్లేరు-చీమలకొండూరు మధ్య ఉన్న వాగుపై.. బ్రిడ్జి పనులు ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే నిలిచిపోయాయని విమర్శించారు. ఆ పనులు వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టిన ఒకరోజు నిరసన దీక్షకు సంఘీభావం తెలిపారు.
అనంతరం మధ్యలోనే నిలిచిపోయిన బ్రిడ్జిని బీర్ల అయిలయ్య పరిశీలించారు. నాలుగేళ్ల క్రితం రూ.65 లక్షలతో ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, పైళ్ల శేఖర్ రెడ్డి శంకుస్థాపన చేసిన బ్రిడ్జి పనులు మధ్యలోనే ఆగిపోవడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని మండిపడ్డారు. దీంతో రెండు గ్రామాల మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి.. విద్యార్థులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. బ్రిడ్జి పనులు వెంటనే పూర్తి చేయాలని.. అలా చేయని పక్షంలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సహకారంతో చొల్లేరు నుంచి కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: అసలు తెలంగాణలో ప్రభుత్వం ఉందా?: బీర్ల అయిలయ్య