యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలో రెక్కాడితే గానీ డొక్కాడని ఓ నిరుపేద కుటుంబం. 20 ఏళ్ల క్రితం జరిగిన ప్రమాదం ఆ కుటుంబంలో చీకట్లు నింపింది. ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి నడుముకు బలమైన దెబ్బ తగలడం, కాళ్లు విరగడం వల్ల మంచానికే పరిమితమైంది ఎల్లమ్మ. పెద్ద కుమారుడు పెళ్లి చేసుకుని వేరే కాపురం పెట్టాడు. రెండెకరాల భూమి అమ్మి ముగ్గురు ఆడపిల్లల పెళ్లిళ్లు చేసింది. కానీ.. ఎవరిదారి వారు చూసుకున్నారు. కానీ చిన్నకుమారుడు నరేశ్ మాత్రం 20 ఏళ్లుగా తన తల్లిని అమ్మగా సాకుతున్నాడు.
అంతులేని ఆత్మస్థైర్యం:
తన ఎనిమిదేళ్ల వయసులోనే తల్లి బాధ్యతను భుజానికెత్తుకున్నాడు నరేశ్. తండ్రి కూలిపనికి వెళ్తే.. ఇంట్లో తల్లికి సపర్యలు చేసి బడికి వెళ్లాడు. ఇంటర్ చదివే సమయంలో విధి మరోసారి వెక్కిరించింది. తండ్రి గుండెపోటుతో మరణించడం నరేశ్‌ను మరింత కుంగదీసింది. అయినా ఆత్మస్థైర్యం కోల్పోకుండా తల్లిని ఉదయం నుంచి రాత్రి వరకూ కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నాడు.
సుమారు ఏడు పదుల వయస్సు ఉన్న ఎల్లమ్మ ఆరోగ్యం క్షీణించింది. పక్షవాతంతో మాట పడిపోయింది. ప్రతిరోజు ఉదయం తల్లికి అన్నం తినిపించి కూలి పనికి వెళ్తాడు. మధ్యాహ్నం ఇంటికి వచ్చి తల్లికి తినిపించి, మందులు వేసి మళ్లీ వెళ్తాడు. ప్రతినెల తల్లి ఆరోగ్యం కోసం సుమారు రూ. 3 వేలకు పైగానే ఖర్చు అవుతుందని నరేశ్ తెలిపాడు. ఎల్లమ్మకు వచ్చే వృద్ధాప్య పింఛను కాస్త ఆసరా అవుతోందని.. దాతలు ఎవరైనా ముందుకొస్తే తల్లికి మెరుగైన వైద్యం చేయిస్తానని కోరాడు. బంధువులు పెళ్లి చేసుకొమ్మని సలహాలిచ్చినా తల్లిని సరిగా చూసుకోలేనేమోనని వివాహం వద్దనుకున్నాడు నరేశ్. దాతలు ఆర్థికసాయం చేస్తే తనకెంతో మేలు చేసిన వారవుతారని అంటున్నాడు.
ఇదీ చూడండి: కరోనా వైరస్‌తో కనిపించే మరో రెండు కొత్త లక్షణాలు!