యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం బిల్యానాయక్ తండాలో ఓ నిరుపేద కుటుంబాన్ని కరోనా కమ్మేస్తోంది. ఇద్దరు పిల్లలతో ఓ చిన్న గుడిసెలో బతుకీడుస్తున్న ఆ తండ్రి లారీ క్లీనర్‌గా పనిచేసేవాడు. లాక్డౌన్ వల్ల ఉన్న జీవనోపాధి పోగొట్టుకున్నాడు. పిల్లలకు ఒక పూట తిండి కూడా పెట్టలేక తల్లడిల్లుతున్నాడు.
రేషన్‌కార్డు ఉన్నా ప్రభుత్వం నుంచి వచ్చే ఏ సాయం అందక తండాకు చెందిన గుగులోతు శంకర్ నాయక్ కుటుంబం దయనీయ స్థితిలో ఉంది. గ్రామ యువత, మహిళల సాయంతో రేకులతో ఓ చిన్న గుడిసె ఏర్పాటు చేసుకున్నాడు. నిప్పులు చెరిగే ఎండకు తమ గుడిసె కూడా నీడనివ్వలేక పోతోందని వాపోయాడు.
తల్లిలేని తన పిల్లలు ఒక్క పూట భోజనం కూడా దొరకక ఆకలితో తల్లడిల్లిపోతున్నారని శంకర్ నాయక్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ప్రభుత్వం, అధికారులు దయతలచి తమను ఆదుకోవాలని కోరుతున్నాడు.