బ్యాంకుల్లో నగదు తీసుకెళ్లేందుకు వచ్చిన వారినే టార్గెట్ చేస్తూ దోపిడీలకు పాల్పడుతున్న ఇద్దరిని భువనగిరి పోలీసులు అరెస్ట్ చేశారు. గత నెల 29న పట్టణానికి చెందిన జ్ఞానేందర్ ఆంధ్రాబ్యాంక్లో 80 వేలు డ్రా చేసి స్కూటీ డిక్కీలో పెట్టాడు. ఏపీజీవీబీ బ్యాంకులో పని ఉందని స్కూటీని బయట నిలిపి లోపలికి వెళ్లి వచ్చేలోగా డబ్బులు మాయం చేశాడో దొంగ. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టగా అసలు విషయం బయటపడింది.
సీసీ కెమెరాల ఆధారంగా బ్యాంకుల వద్ద అనుమానంగా తిరుగుతున్న కిషోర్ కుమార్, భాను సుధాకర్ అనే వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించగా చేసిన నేరం అంగీకరించారని సీఐ సురేందర్ తెలిపారు. నిందితుల నుంచి 36 వేల రూపాయల నగదు, ఒక ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. నిందితులిద్దరూ గుంటూరు జిల్లా బాపట్ల మండలం వెదుళ్లపల్లికి చెందినవారిగా గుర్తించారు. కిషోర్ కుమార్ పై గతంలో 14 కేసులు ఉన్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం నిందితులిద్దరినీ రిమాండ్కు తరలించినట్లు సీఐ సురేందర్ స్పష్టం చేశారు.
ఇవీ చూడండి: కొండగట్టులో ముగిసిన హనుమాన్ జయంతి ఉత్సవాలు