young lady killed a man in mulugu: సహనానికి కూడా హద్దు ఉంటుంది. పరిధి దాటితే చీమైనా సింహంలా విజృంభించొచ్చు. అందుకే ఏదైనా అతి పనికి రాదని పెద్దలు చెబుతుంటారు. అలా ఓ యువకుడు ఆమెతో అతిగా ప్రవర్తించాడు. ఆ తర్వాత లైంగిక వాంఛ తీర్చాలని వేధించడం మొదలుపెట్టాడు. మొదట్లో ఇదంతా మామూలేనని భావించిన యువతి సైలెంట్‌గా ఉంది. కానీ పోనుపోను వేధింపులు ఎక్కువ అవ్వడంతో సహనం కోల్పోయింది. పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. అయినా అతడి తీరులో మార్పు రాకపోవడంతో విసిగిపోయి ఏకంగా అతణ్ని హతమార్చింది. ఈ ఘటన ములుగు జిల్లాలోని ఏటూరునాగారంలో చోటుచేసుకుంది.
young lady killed a man in mulugu for harassing : ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలో లైంగిక వాంఛ తీర్చాలని వేధిస్తున్న యువకుడిని హతమార్చింది ఓ యువతి. రోజురోజుకు అతడి వేధింపులు తాళలేక.. ఎలాగైనా ఆ బాధ నుంచి బయటపడాలని చివరకు చంపేసింది. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పోలీసుల ఎదుట లొంగిపోయింది. అసలేం జరిగిందంటే..?
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రంలోని మూడో వార్డులో రామటెంకి శ్రీనివాస్(25) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఏ పనిపాటా లేకుండా జులాయిగా తిరుగుతుండేవాడు. పెళ్లి చేస్తే అయినా మారతాడేమోనని భావించి అతడి తల్లిదండ్రులు రెండేళ్ల క్రియం ఓ యువతితో వివాహం జరిపించారు. పెళ్లయినా అతడి తీరు మారకపోగా.. భార్యను చిత్రహింసలు పెట్టేవాడు. అతడి టార్చర్ భరించలేక ఆ మహిళ శ్రీనివాస్‌ను వదిలి వెళ్లిపోయింది.
ఇది అవమానకరంగా భావించిన శ్రీనివాస్ తాగుడుకు బానిసయ్యాడు. మరోవైపు బలాదూర్‌గా తిరగడం మానలేదు. ఈ క్రమంలో ఐదో వార్డులోని ఓ యువతిపై మనసుపడ్డాడు శ్రీనివాస్. ఇక అప్పటి నుంచి ఆమె వెంటపడి వేధిస్తూ ఉండేవాడు. తన లైంగిక వాంఛ తీర్చాలని.. బలవంతం చేసేవాడు. రోజురోజుకు శ్రీనివాస్ వేధింపులు ఎక్కువయ్యాయి. ఇక భరించలేక ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
కొద్దిరోజుల క్రితం జైలు నుంచి విడుదలైన శ్రీనివాస్ నేరుగా యువతి వద్దకు వెళ్లాడు. మళ్లీ తన లైంగిక వాంఛ తీర్చాలని వేధించసాగాడు. గమనించి మందలించడానికి వచ్చిన స్థానికులతో గొడవపడ్డాడు. ఇక అతడి వేధింపులు తట్టుకోలేక.. అతడి ప్రవర్తనతో విసుగెత్తిన ఆ యువతి ఎలాగైనా ఆ బాధ నుంచి విముక్తి పొందాలనుకుంది. శ్రీనివాస్‌ను అంతమొందించాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే బుధవారం రాత్రి మరోసారి తన వద్దకు వచ్చిన శ్రీనివాస్‌ను మెల్లగా మాటల్లో పెట్టి రెండు చేతులు కట్టేసింది. అనంతరం కత్తితో అతడిని దారుణంగా పలుమార్లు పొట్టలో పొడిచింది హతమార్చింది. తర్వాత పోలీసుల ఎదుట లొంగిపోయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి: