woman Generating Employment to 20 Women: హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం గోపాల్‌పూర్‌కు చెందిన కోదాటి పుష్పలత అనే మహిళ సాధారణ రైతు. రైతు కుటుంబంలో ఎన్ని బాధలుంటాయో.. పుష్పలత అవన్నీ చూసింది. ఎన్నో ఒడిదొడుకలతో గడుస్తున్న కుటుంబానికి తాను కాస్త ఆసరా కావాలనుకుంది. మహిళలు.. స్వశక్తితో ఎదగాలనే తపన ఆమెది. అందుకే ఆర్థికంగా తాను నిలదొక్కుకోవడమే గాకుండా.. కుటుంబానికి ఆధారమవ్వాలని నిర్ణయించుకుంది. అందుకే టైలరింగ్ పని చేస్తూ.. తనతో పాటు మరికొంత మందికి ఆ పని నేర్పింది.
టైలరింగ్‌తో ఆపితే మనం ఆమె గురించి ఎందుకు చెప్పుకుంటామిప్పుడు. దీంతో పాటు ఇంకా ఏదో చేయాలని తపన పడింది. అందులో భాగంగానే పుష్పలత.. పిండి వంటలు చేసి డబ్బు సంపాదించాలనుకుంది. ఇంట్లో పిండివంటలు చేయటం సహజం. అయితే అవసరమున్నవారికి మంచి రుచితో చేసివ్వాలనే ఆలోచనతో ముందడుగు వేసింది పుష్పలత. ఇలా ప్రయత్నం ప్రారంభించగానే మంచి గిరాకీలు వచ్చాయి. తొలుత 5 గురు మహిళలతో ప్రారంభించింది. కావల్సిన పిండి పదార్ధాలను అనుకున్న సమయానికి వినియోగదారులకు అందించింది. ఇలా 5 గురితో ప్రారంభమై నేడు సుమారు 25 మంది మహిళలకు ఉపాధిని కల్పిస్తుంది.
ఇంట్లో, వివాహా శుభకార్యాలకు ఎటువంటి పిండిపదర్ధాలు ఏ సైజులో కావాలన్నా ఆ సైజులో తయారు చేస్తున్నారు. అనుకున్న సమయానికి కస్టమర్లకు చేరవేస్తున్నారు. విపణిలో ఉన్న ధర కంటే చాలా తక్కువ ధరకు అందించటంతో భలే గిరాకీ వస్తుంది. ఆ మహిళలకు చేతినిండా పని దొరుకుతుంది. సకినాలు, లడ్డు, అరిసెలు, గారెలు, మడుగులు, చెకోడీలు ఇలా సుమారు 60 రకాల వరకు పిండివంటలు తయారు చేస్తున్నారు. చిన్న సైజు నుంచి వినియోగదారులకు కావల్సినంత సైజు వరకు తయారు చేయటం వీరి ప్రత్యేకత.
'ప్రస్తుతం 25 మందితో ఈ కుటీర పరిశ్రమను నడిపిస్తున్నా. మాది రైతు కుటుంబమే. మహిళలకు చాలా కష్టాలుంటాయి. వారికి ఖర్చులుంటాయి. ఇంటి అవరసరాలకు ఎంతగానో ఉపయోగపడుతాయి. గత పదిహేను సంవత్సరాలుగా చేస్తున్నా.'-కోదాటి పుష్ప, నిర్వాహకురాలు
ఇందూరు నుంచి విదేశాలకు పిండి వంటలు
వినియోగదారులు తమకు కావల్సిన పిండి పదార్థాలను ఒక ఫోన్ ద్వారా చెబితే చాలు ఆ సమయానికి ఆ పిండిపదార్థాలు తయారవుతాయి. వినియోగదారులు రాలేని పరిస్థితుల్లో వారి ఇంటికే చేరేలా రవాణా సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. ఇందతా చేస్తే ఎంతో ధర అనుకుంటే పొరపాటే. మార్కెట్ ధర కంటే తక్కువగానే ఉంటుంది. ఏదైనా కిలోకు రూ.300లు మాత్రమే. అలా అని నాసిరకం పదార్థాలు అనుకుంటే చాలా పొరపాటే. అన్ని నాణ్యమైన ముడి సరుకులతోనే తయారు చేయటం వీరి ప్రత్యేకత.
'మంచి నాణ్యతతో పిండి వంటలు తయారు చేస్తున్నాం. ఎంతోమంది వినియోగదారులు వస్తుంటారు. సుమారు 15 మందికి ఉపాధి కల్పిస్తుంది. మేం ఇక్కడ పని చేయటంతో మాకు ఆర్థికంగా దోహదపడుతుంది. లాభంతో కాదు చేసేది. నష్టం వచ్చిన భరించుకుంటాం.'- బోయినపల్లి అనూష, గృహిణి
ఆర్డర్లు వచ్చినప్పుడు అందరికి పిలిచి పని ఇస్తారని అందులో పని చేస్తున్నవారు చెప్పారు. ఇప్పటి కాలంలో స్వార్ధం లేకుండా సాటి మహిళలకు తన వంతు ఏదో చెయ్యాలి అని ఆలోచించింది పుష్ప. తనకు వచ్చిన మొత్తంలో అందరితో పంచుకుంటూ తనకు తోచినంత సహాయం చేసుకుంటూ జీవితాన్ని గడుపుతుంది.
ఇవీ చదవండి: