bhadrakali pond: జోరు వర్షాలతో వరంగల్లోని భద్రకాళీ చెరువు నిండుకుండలా మారింది. ఐదురోజులుగా కురుస్తున్న వర్షాలతో చెరువు మత్తడి దూకుతోంది. భద్రకాళీ చెరువు పూర్తి సామర్ధ్యం 150 మిలియన్ క్యూబిక్ ఫీట్లు కాగా చెరువు పూర్తిగా నిండటంతో మత్తడి పోస్తోంది. నగరంలోని వడ్డేపల్లి చెరువు కూడా మత్తడి దూకుతోంది. చెరువులు ఇప్పటికే నిండడం, ఇంకా వర్షాలు పడుతుండడంతో గ్రేటర్ వరంగల్ అధికారులు అప్రమత్తమయ్యారు. దిగువన ఉన్న లోతట్టు ప్రాంతాలు జలమయం కాకుండా ముందస్తు చర్యలు చేపట్టారు.
మరోపక్క చెరువులో చేపలకు డిమాండ్ పెరిగింది. మత్తడి దూకుతున్న నీటిలో చేపలు సులభంగా లభిస్తున్నాయి. ఒక్కో చేప 5 కిలోల వరకు ఉంది. విషయం తెలుసుకున్న స్థానికులు చెరువు వద్దే వీటిని కొనుగోలు చేసేందుకు ఉత్సాహంగా తరలివచ్చారు. దీంతో చెరువు పరిసరాల్లో సందడి నెలకొంది.