Cotton Farmers Troubles Due To Rains: వరంగల్ ఎనుమాముల మార్కెట్‌లో పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. తెల్లబంగారాన్ని మార్కెట్‌కు తీసుకొస్తున్న రైతులు.. ముందుగా కాంటాల వద్ద పూజలు చేసి అమ్మకాలు చేస్తున్నారు. ప్రస్తుతం రోజుకు నాలుగైదు వందల బస్తాల మేర పత్తి మార్కెట్‌కు వస్తుందని అధికారులు అంటున్నారు. పత్తి ధర క్వింటాకు ఎనిమిది వేల రూపాయలు పలుకుతున్నా వర్షాల కారణంగా.. పత్తి తడవటంతో మంచి ధర అందుకోలేకపోతున్నామని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రంలో కురుస్తున్న అధిక వర్షాలు పత్తి రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. జులై నుంచి మెుదలుకొని వరుసగా వర్షాలు పడుతుండటంతో పంట దెబ్బతిని దిగుబడి తగ్గిందని రైతులు వాపోతున్నారు. కుండపోత వానలతో చాలా చోట్ల కాతా, పూతా రాలిపోయింది. వీటన్నింటిని దాటి కాసిన కొన్ని కాయలు నీరు నిల్వ ఉండటంతో కుళ్లిపోతున్నాయి. మొక్కలు బారెడు పెరిగినా పూత రావట్లేదు.
ఫలితంగా దిగుబడి రాకుండా పోతోందని అన్నదాతలు వాపోతున్నారు. దేశీయంగానే కాదు అంతర్జాతీయంగా కూడా పత్తికి మంచి డిమాండ్ ఉంది. అందులోనూ వరంగల్ జిల్లాలో పండించే పత్తి నాణ్యతలో మేటిగా ఉంటుంది. ముందు ముందు క్వింటా 11 నుంచి 12 వేల రుపాయల ధర పలికే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. అయితే అసలు పంట ఉంటే కదా ధర వచ్చేదని రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా వరుణుడి ప్రతాపం తగ్గి ఎండలు కాస్తే కష్టాలనుంచి గట్టెక్కవచ్చని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
"గతంలో కురిసిన వర్షాలకు పత్తి పంటలు దెబ్బతిన్నాయి. దీంతో మందుల పిచికారి వల్ల కొంచెం బాగానే ఉండేది. కానీ గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో పూత, కాత రావడంలేదు. ఇప్పటికైనా వరుణుడి ప్రతాపం తగ్గి ఎండలు కాస్తే కష్టాలనుంచి గట్టెక్కవచ్చు." -బాధిత రైతులు
ఇవీ చదవండి: యాసంగిలో వరి సాగుపై ఆంక్షలు ఎత్తేయనున్న ప్రభుత్వం
జాతరలో బోర్ కొట్టి చెరువు గట్టున వాకింగ్.. వజ్రం దొరికి రాత్రికి రాత్రే లక్షాధికారిగా...