Warangal Super Specialty hospital : చారిత్రక నగరిగా ఖ్యాతి పొందిన ఓరుగల్లులో అధునాతమైన వైద్యసేవలందించేందుకు తలపెట్టిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం పనులు చకచకా జరుగుతున్నాయి. ఆదివారాలు, సెలవుల్లోనే కాకుండా రాత్రింబవళ్లు కార్మికులు.. పనిచేస్తూ నిర్మాణాలు చేపడుతున్నారు. ఏడాదిన్నర కల్లా ఆసుపత్రిని ప్రారంభిస్తామని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు చెప్పగా.. ఇప్పుడు పనుల వేగాన్ని బట్టి చూస్తే మరింత ముందుగానే పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ప్రస్తుతం ఉన్న ఎంజీఎం ఆస్పత్రి రోగులకు సరిపోకపోవడంతో.. కేంద్ర కారాగారాన్ని తొలగించి ఆ ప్రాంతంలో అత్యాధునిక సౌకర్యాలతో ఈ ఆసుపత్రిని నిర్మిస్తున్నారు. పేదలకు ఉచితంగా సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలందిస్తూ.. వరంగల్ నగరం ఓ హెల్త్ సిటీగా నిలవాలన్న లక్ష్యంతో.. ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.1200 కోట్లకు పైగా వ్యయంతో ఈ ఆసుపత్రిని నిర్మాణానికి సంకల్పించారు. 2021 జూన్‌లో దీని నిర్మాణానికి భూమి పూజ చేశారు.
24 అంతస్తులతో ఆస్పత్రి నిర్మాణం: 24 అంతస్తులతో అత్యాధునిక హంగులతో నిర్మించనున్న ఈ ఆసుపత్రి నిర్మాణాన్ని ఎల్ అండ్ టీ సంస్ధకు అప్పగించారు. 4 నెలల క్రితం ఆసుపత్రిని సందర్శించిన ముఖ్యమంత్రి.. డిజైన్ బాగాలేదంటూ అధికారులకు పలు సూచనలు చేశారు. ఇందుకనుగుణంగా మార్పులు చేసి, పనుల్లో వేగం పెంచారు. రహదారులు భవనాల సంస్ధ ఈ ఆసుపత్రిని పనులను పర్యవేక్షిస్తోంది. ఆర్ అండ్ బీతో పాటు నిత్యం 50 మంది ఇంజినీర్లు నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్నారు.
34 విభాగాల్లో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు: 59 ఎకరాల్లో సువిశాలంగా నిర్మిస్తున్న ఆసుపత్రిలో.. గుండె ఇతర అవయావాల మార్పిడి, యూరాలజీ నెఫ్రాలజీ తదితర 34 విభాగాల్లో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు రోగులకు అందనున్నాయి. ఇంకా సువిశాలమైన ఆడిటోరియం, 300 ఐసీయూ పడకలు, 1399 జనరల్ వార్డు పడకలు, 25 కీమో థెరెఫీ పడకలు ఇలా మొత్తం 2,000 పడకలతో పాటు.. వైద్యుల కోసం ప్రత్యేకంగా గదులు, వైద్య విద్యార్ధులకు సెమినార్ హాళ్లు నిర్మిస్తున్నారు.
పచ్చదనం పెంచేలా ఆసుపత్రి ముందు అందమైన ఉద్యానవనం, విశాలమైన పార్కింగ్ ఇలా అనేక ప్రత్యేకతలతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సర్వాంగ సుందరంగా నిర్మితం కానుంది. వరంగల్‌లో ఈ ఆసుపత్రి నిర్మాణం పూర్తైతే... నగర పరిసర ప్రాంత ప్రజలకు అధునాతన వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. రోగులకూ వారి సహాయకులకు హైదరాబాద్ వెళ్లే బాధలు తప్పుతాయి.
ఇవీ చదవండి: రాష్ట్రంలో నేటి నుంచే.. టీచర్ల బదిలీలు, పదోన్నతులు
పోలీసుశాఖలో సంచలనం.. 91 మంది అధికారుల స్థానచలనం.. ఉమ్మడి రాష్ట్రంలోనూ ఇదే తొలిసారి
అంతా 'మోదీ'మయమే.. తగ్గని ప్రజాదరణ.. ముచ్చటగా మూడోసారి ప్రధాని పీఠంపై!