వరంగల్ నిట్‌కు దేశంలోనే 23వ ర్యాంక్ లభించింది. దేశంలోని ప్రతిష్ఠాత్మక సాంకేతిక విద్యా సంస్థలకు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ 2020-21 విద్యా సంవత్సరంలో విద్యా, పరిశోధన తదితర విభాగాల్లో సాధించిన పురోగతి ఆధారంగా విడుదల చేసిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్(ఎన్ఐఆర్ఎఫ్)లో వరంగల్ ఎన్ఐటీకి దేశంలోని అన్ని ఇంజినీరింగ్ విద్యా సంస్థల్లో 23వ ర్యాంక్ లభించింది. దేశవ్యాప్తంగా ఉన్న ఎన్ఐటీలలో వరంగల్ ఎన్ఐటీ నాలుగో స్థానంలో నిలిచింది. ఓవరాల్ ర్యాంకింగ్‌లో 59వ స్థానం దక్కింది.
దేశవ్యాప్తంగా ఉన్న ఉన్నత విద్యా కళాశాలల్లో బోధనాభ్యసన వనరులు, వృత్తి గతమైన పరిశోధనలు, గ్రాడ్యుయేషన్ అవుట్ కం, అవుట్ రీచ్ ఇంక్లూసివిటీ, పర్ సెప్షన్ ఈ 5 అంశాలను ప్రామాణికాలుగా గత ఐదేళ్లుగా కేంద్రం జాతీయ స్థాయిలో సాంకేతిక కళాశాలలకు ర్యాంకింగ్‌ను ప్రకటిస్తుంది.
వరంగల్ నిట్‌లోని అధ్యాపకుల సమష్టి కృషితోనే ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్‌లో మంచి స్థానం సాధించామని నిట్ సంచాలకులు ఆచార్య ఎన్.వి.రమణారావు పేర్కొన్నారు. ఇందుకోసం కృషి చేసిన అధ్యాపకులు, బోధనేతర అధికారులు, ఉద్యోగులకు అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో దేశంలోని సాంకేతిక విద్యాసంస్థల్లో వరంగల్ ఎన్ఐటీని టాప్ ర్యాంకింగ్‌లో ఉంచేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: Khairtabad Ganesh : భాగ్యనగరంలో గణేశుడి సందడి.. ఖైరతాబాద్‌లో భక్తుల కిటకిట