విశాఖ గ్యాస్ లీక్ ఘటన మనం అప్రమత్తం కావాల్సిన ఆవశ్యకతను గుర్తు చేస్తోంది. గతంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు పరిశ్రమల్లో జరిగిన ప్రమాదాల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు.
2018లో వరంగల్‌లోని కాశీబుగ్గలో ఓ బాణసంచా పరిశ్రమలో జరిగిన పేలుడులో ఏకంగా 10 మంది ప్రాణాలు కోల్పోయారు. కొద్ది నెలల క్రితం జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం పరిధిలో ఒక టిన్నర్ పరిశ్రమలో విద్యుదాఘాతం జరిగింది. సమీపంలో ఉన్న కస్తూర్బా గాంధీ విద్యాలయంలోని 60 మంది విద్యార్థినులు అస్వస్థతకు లోనయ్యారు. ఇందులో ప్రాణ నష్టం జరగలేదు.
కొన్ని నెలల క్రితం మడికొండలోని ఒక పరిశ్రమలో రసాయనాల వల్ల జరిగిన ప్రమాదంలో ఇద్దరు గాయపడగా ఒక మహిళ మృతిచెందింది.
సింగరేణి పెద్దది..
ఆరు జిల్లాల్లో రసాయన పరిశ్రమల సంఖ్య తక్కువే. భారీ పరిశ్రమ అంటే సింగరేణి గనులే అని చెప్పాలి. భూపాలపల్లి జిల్లాలోని సింగరేణిలో భూగర్భ, ఓపెన్ కాస్ట్ గనులు ఉన్నాయి. లక్షల టన్నుల బొగ్గును తవ్వే క్రమంలో అనేక ప్రమాదాలు జరిగేందుకు ఆస్కారం ఉంటుంది. బొగ్గులో నుంచి కార్బన్ మోనాక్సైడ్ వెలువడడం ప్రమాదకరం. ఇది బయటకు రాకుండా అడ్డుగోడలు కడతారు. గ్యాస్ వల్ల ఇప్పటి వరకు ఎవరూ చనిపోలేదు.
గతంలో పై కప్పు కూలడం, టబ్బులు ఊడిపోవడం, మ్యాన్‌రైడింగ్ పైనుంచి జారిపడడం లాంటివి జరిగి కొందరు చనిపోయారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అప్పుడప్పుడు అపశ్రుతులు చోటుచేసుకుంటున్నాయి. కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ప్రమాదాలను పూర్తిగా నివారించాల్సిన అవసరం ఉంది. కార్మికుల రక్షణ కోసం మరింత అప్రమత్తత అవసరం.
ఇక ప్రైవేటు పరిశ్రమల విషయానికొస్తే.. ఎక్కువగా గ్రానైట్ క్వారీ, ఫినిషింగ్, పత్తి జిన్నింగ్, రైస్ మిల్లులు, ఇతరత్రా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఉన్నాయి. వీటిలో నిబంధనలన్నీ కచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉంది. కొన్నిసార్లు అధికారుల తనిఖీలు అంతంతే కావడం, యాజమాన్యాలు నిర్లక్ష్యం వహించడం వల్ల పలు పరిశ్రమల్లో జరిగిన ప్రమాదాల్లో కార్మికులు, పరిసరాల వారు ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి.
పరిశ్రమల్లో కార్మికులు, ఇతరత్రా సిబ్బంది ప్రమాదానికి గురై మృతిచెందితే వారికి పరిహారం అందని సందర్భాలు అనేకం ఉంటున్నాయి. నగరాల్లో ఉన్న చిన్నపాటి పరిశ్రమలు కొన్ని అగ్నిమాపక శాఖ, మున్సిపాలిటీ నుంచి సరైన అనుమతుల్లేకుండా నడపడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నట్టు గతంలో విమర్శలు వచ్చాయి. విశాఖ ఘటన నేపథ్యంలో మన వద్ద పరిశ్రమల యాజమాన్యాలు, అధికారులు ఎంతో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.
జిల్లా భారీ పరిశ్రమలు /చిన్న పరిశ్రమలు
- జయశంకర్ (ములుగు): 3 /418
- వరంగల్ అర్బన్: 5 /1336
- జనగామ: 2 /39
- వరంగల్ రూరల్ : 0 /719
- మహబూబాబాద్ : 1 /399