వరంగల్ పట్టణ జిల్లా కాజీపేట్ మండలం మడికొండ వద్ద ఉద్రిక్తత నెలకొంది. జిల్లా కేంద్ర కారాగారంలో ఉన్న జనగామ కాంగ్రెస్ అధ్యక్షుడు రాఘవరెడ్డిని పరామర్శించేందుకు వెళ్లిన కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ర్యాలీగా వెళుతున్న ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలను మడికొండ వద్ద అడ్డుకోగా.. కార్యకర్తలు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది.
ఈ క్రమంలో వాహనం దిగి కొంత దూరం నడిచిన నేతలు.. అనంతరం కారు ఎక్కి వరంగల్‌కి వెళ్లారు. దీంతో రహదారిపై వాహనాలు అడ్డుగా పెట్టి కాంగ్రెస్ శ్రేణులు నిరసన తెలుపగా.. వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. కారాగారంలోకి వెళ్లిన కాంగ్రెస్ నేతలు.. జంగా రాఘవరెడ్డితో చరవాణీ ద్వారా పరమార్శించారు.
రాఘవరెడ్డిపై కావాలనే అక్రమ కేసులు బనాయించారని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. పోలీసులు కూడా అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ.. ఉత్తమ్ తీవ్రస్ధాయిలో థ్వజమెత్తారు. కులం పేరుతో పోలీసులు దుర్భాషలాడారని .. వారిపై ఎందుకు చర్య తీసుకోలేదని ప్రశ్నించారు. దోపిడీ దొంగల్లా తెరాస నేతలు రాష్ట్రాన్ని దోచుకుంటూ.. కాంగ్రెస్ నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారని విమర్శించారు. సీఎం కేసీఆర్‌కు, మంత్రి ఎర్రబెల్లికి సమయం దగ్గరపడిందని.. పతనం ఖాయమని చెప్పారు.
కార్యకర్తలు అధైర్యపడవద్దని పార్టీ అండగా ఉంటుందని కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి హామీ ఇచ్చారు. అభివృద్ధిని మరిచిపోయిన తెరాస నేతలు... కాంగ్రెస్ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని.. ఎంపీ కోమటి రెడ్డి వెంకటరెడ్డి, సీతక్క పేర్కొన్నారు. బేషరతుగా జంగా రాఘవరెడ్డిని విడుదల చేయకపోతే.. పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చూడండి : దా'రుణ' యాప్ వేధింపులు.. యువకుడు ఆత్మహత్య