Sanskriti mahotsav: ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా జాతీయ సాంస్కృతిక మహోత్సవానికి వరంగల్ వేదికైంది. హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో వేడుకలను రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ లాంఛనంగా ప్రారంభించారు. వివిధ రాష్ట్రాల కళాకారులు ఏర్పాటు చేసిన స్టాళ్లను గవర్నర్ బ్యాటరీ కారులో వెళ్లి వీక్షించారు. తమ ప్రాంత వేషధారణలు, కట్టుబొట్టుతో వచ్చిన కళాకారులతో కలసి ఫోటోలు దిగారు. డప్పు వాయించి వారితో నృత్యం చేశారు.
దేశానికి స్వేచ్ఛను ప్రసాదించిన స్వాతంత్ర్య సమరయోధులే నిజమైన హీరోలని గవర్నర్ తమిళిసై కీర్తించారు. నాటి మహానీయుల త్యాగాలను నేటి తరం నిరంతరం గుర్తుంచుకోవాలని ఉద్బోధించారు. చారిత్రక నగరి ఓరుగల్లు జాతీయ సాంస్కృతిక మహోత్సవానికి ఆతిథ్యం ఇవ్వడం సంతోషకరమన్నారు.
దేశం కోసం పోరాడిన స్వాతంత్ర్య సమరయోధులందరికీ సెల్యూట్ చేస్తున్నా. వారి పోరాటాల వల్లే దేశ ప్రజలంతా స్వేచ్ఛా వాయువులు పీల్చుతున్నారు. స్వాతంత్ర్యం తెచ్చిన మహానీయుల త్యాగాలను మనం ఎల్లవేళలా గుర్తుంచుకోవాలి. 75 ఏళ్ల స్వాతంత్ర్య వేడుకలను ఆజాదీకా అమృత్ మహోత్సవ్ పేరుతో ఏడాదంతా జరుపుకుంటున్నాం. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న మన సంస్కృతి ఐక్యతను చాటుతుంది. భిన్నత్వంలో ఏకత్వం మన దేశ మౌలికసూత్రం.
- తమిళిసై సౌందరరాజన్, రాష్ట్ర గవర్నర్
సాంస్కృతికోత్సవంలో ప్రదర్శనలు అలరించాయి. ఈశాన్య రాష్ట్రాల కళాకారులు చేసిన జానపద నృత్యాలు ఆకట్టుకున్నాయి. స్ధానిక కళాకారులు కూచిపూడి నృత్యాలతో రంజింపజేశారు. హైదరాబాద్ బ్రదర్స్... శాస్త్రీయ సంగీతం వీనులవిందుగా సాగింది.
ప్రత్యేక ఆకర్షణగా..: ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన 80 స్టాళ్లలో హస్తకళాకృతులు కొలువుదీరాయి. వెదురుతో చేసిన వస్తువులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. జాతీయ సాంస్కృతిక ఉత్సవానికి రావడం.. సంతోషాన్నిచ్చిందని వరంగల్ బాగుందని కళాకారులు హర్షం వ్యక్తంచేశారు. హనుమకొండ జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్, కేంద్ర సాంస్కతిక శాఖ సంయుక్త కార్యదర్శి మినహా గవర్నర్ పర్యటనలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులెవరూ పాల్గొనకపోవడం చర్చనీయాంశమైంది.
ఇదీచూడండి: Inavolu Mallanna temple: కనువిందుగా ఐనవోలు మల్లన్న పెద్దపట్నం