శాసనసభ ఎన్నికల్లో విపక్ష పార్టీలను చిత్తు చేసిన తెరాస మళ్లీ అదే జోరు పార్లమెంట్ ఎన్నికల్లోనూ కొనసాగించేందుకు పక్కా వ్యూహంతో అడుగులు వేస్తోంది. 16 పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకుని దిల్లీలో చక్రం తిప్పేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతోంది. తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇవాళ ఉదయం పదిన్నరకు వరంగల్ పార్లమెంట్సన్నాహక సమావేశానికి హాజరు కానున్నారు. వరంగల్ తూర్పు, పశ్చిమ, వర్ధన్నపేట, స్టేషన్ ఘన్పూర్, పరకాల, పాలకుర్తి, భూపాలపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో జరుగుతున్న ఈ సమావేశానికి భారీ సంఖ్యలో కార్యకర్తలను తరలించేందుకు నేతలు ప్రణాళికలు సిద్ధం చేశారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు పర్యవేక్షణలో జిల్లా నేతలంతా సన్నాహక సభకు విస్తృత ఏర్పాట్లు చేశారు.
భారీగా స్వాగత ఏర్పాట్లు...
వరంగల్ అర్బన్ జిల్లా హసన్పర్తి వద్ద జిల్లాలోకి అడుగిడనున్న కేటీఆర్కు పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలుకడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. అక్కడి నుంచి కేయూ కూడలి హన్మకొండ చౌరస్తా మీదుగా ద్విచక్రవాహనాలతో భారీ ప్రదర్శనగా సభాస్థలికి చేరుకొనున్నారు. కేటీఆర్ రాకను పురస్కరించుకుని నగరం ఇప్పటికే పూర్తిగా గులాబీ మయమైంది. యువ నేతకు స్వాగతం తెలుపుతూ నగరం నలువైపులా బ్యానర్లు హోర్డింగ్లువెలిశాయి. వరంగల్ పార్లమెంటరీ సన్నాహక సమావేశాన్ని ముగించుకున్న అనంతరం కేటీఆర్ మధ్యాహ్నం భువనగిరి పార్లమెంటరీ సన్నాహక సమావేశంలో పాల్గొంటారు.
ఇవీ చూడండి:తాటి, ఈత వనాలకు ప్రాధాన్యం