No Ambulance service at Shayampet in Hanamkonda : హనుమకొండ జిల్లా, శాయంపేట మండల కేంద్రానికి అంబులెన్స్ సౌకర్యం లేక స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గర్భిణీలు, రోడ్డు ప్రమాద బాధితులు, గుండె జబ్బులు వంటి అనేక మంది బాధితులకు అత్యవసర వైద్య సేవలు అవసరం. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను తరలించడానికి 108కి ఫోన్ చేస్తే పక్క మండలాలైన పరకాల, ఆత్మకూరు నుంచి అంబులెన్స్ రావాల్సిందే. ఆయా ప్రాంతాల్లో బాధితులను తరలిస్తుంటే మాత్రం వీరికి మొండి చెయ్యే.
పేరుకు మాత్రమే మండల కేంద్రం: ఆ సమయానికి ప్రైవేటు వాహనాలు అందుబాటులో లేకుంటే ప్రాణాలకే ముప్పు. తమ మండలానికి అంబులెన్స్ కేటాయిస్తే సరైన సమయంలో వైద్య సదుపాయాలు అందుతాయని స్థానికులు కోరుకుంటున్నారు. శాయంపేట మండలంలో 24 పంచాయతీలు, మండల కేంద్రంతో కలిపి దాదాపుగా 40 వేలకు పైగా జనాభా ఉంది. పేరుకు మాత్రం మండల కేంద్రం అయినా కనీసం ఆ ఊరికి ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సు కూడా లేదు. ఈ ప్రాంత ప్రజలు.. తహశీల్దార్, పోలీస్, ఎంపీడీవో కార్యాలయం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, బ్యాంకు వంటి పనుల కోసం మండల కేంద్రానికి నడిచి వెళ్లాల్సిందే.
ప్రమాదాలు సంభవిస్తే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాలి: వస్తూ, పోతున్న క్రమంలో ఏదైనా ప్రమాదం సంభవిస్తే క్షతగాత్రులను తరలించేందుకు ప్రైవేటు వాహనాలే దిక్కవుతున్నాయి. ఆసుపత్రి ఖర్చులకే ఇబ్బందులు పడుతున్న పేదలకు.. ప్రైవేటు వాహనాల కిరాయిలు మరింత భారంగా మారుతున్నాయి. అంబులెన్స్ సౌకర్యం కోసం పలుమార్లు ప్రజాప్రతినిధులు, అధికారులకు విన్నవించినా పట్టించుకోవట్లేదని మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్షతగాత్రుల ప్రాణాలు కాపాడటంలో సమయమే కీలకం. సకాలంలో అంబులెన్స్ రాక ప్రాణాలు పోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని స్థానికులు అంటున్నారు. అంబులెన్స్ సౌకర్యం కల్పించి ప్రాణాలు రక్షించాలని సంబంధిత అధికారులను వేడుకుంటున్నారు.
ప్రమాదం జరిగితే ఆత్మకూరు, పరకాలకు గానీ 108కి ఫోన్ చేసినట్లైతే.. వాళ్లు వారి ప్రాంతంలోని సమస్యలపైన వేరే గ్రామంలోకి వెళ్లే క్రమంలో తిరిగి మా శాయంపేటకు రావాలంటే దాదాపు గంట సమయం దాకా పడుతుంది. ఈలోపు ప్రాణంపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి, దయచేసి ప్రజాప్రతినిధులు, అధికారులను 108 సౌకర్యం కల్పించి ప్రాణాలను కాపాడాల్సిందింగా కోరుతున్నాము. -స్థానికులు
ఇవీ చదవండి: