Telangana cotton farmers problems: ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పత్తి పంటను అధికంగా సాగు చేశారు. హనుమకొండ జిల్లా పరకాల రెవిన్యూ డివిజన్‌లో విస్తృతంగా తెల్లబంగారాన్ని పండించారు. అధిక వర్షాలు, చీడపీడలు ఎదురైనా తట్టుకుని.. పత్తిని కాపాడుకున్నారు. దిగుబడి ఆశాజనకంగా వచ్చిందని ఆనందించే లోపే అంతర్జాతీయ మార్కెట్‌లో తెల్ల బంగారం ధర పడిపోవడంతో... ఆవేదనలో ముగినిపోయారు. మళ్లీ ధర పెరుగుతుందనే ఆశతో.. చాలా మంది రైతులు ఇళ్లలోనే పత్తిని నిల్వ చేసుకున్నారు.
Low Price for Telangana cotton : ఎరువులు, పురుగు మందులు, కూలీ ఖర్చులు పెద్ద ఎత్తున పెరిగిపోయాయి. ప్రస్తుత పరిస్థితుల్లో మార్కెట్‌లో క్వింటా పత్తి ధర 6 వేల నుంచి 7 వేల 300 రూపాయల వరకు ధర పలుకుతోంది. ఇంకా ధర పెరుగుతుందన్న ఆశతో ఇళ్లలో పత్తిని నిల్వ ఉంచుకుంటే.. పిల్లలతోపాటు పెద్దలకు దురద, చర్మ వ్యాధులు, శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయని రైతులు వాపోతున్నారు.
'పత్తి ధర బాగా పడిపోయింది. ఇంట్లో నిల్వ చేస్తే రోగాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆరు వేల రూపాయలుగా మార్కెట్‌లో ధర నడుస్తోంది. గతేడాది ఈ సమయానికి క్వింటాకు పద్నాలుగు నుంచి పదిహేను వేల రూపాయల వరకు ధర పలికింది. ఎరువులు, పురుగు మందులు, కూలీ ఖర్చులు పెద్దఎత్తున పెరిగిపోయాయి. మాకు పదివేలకు క్వింటాల్ చొప్పున అమ్మితే పెట్టుబడి మిగులుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే మమ్మల్ని ఆదుకోవాలి.' - రైతు ఆవేదన
ధర లేకపోవడం వల్ల వ్యవసాయ మార్కెట్‌కు పత్తి రాక తగ్గిపోయింది. దాదాపు 40 శాతం పత్తి ఇళ్లలోనే ఉండిపోయిందని... మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. గతేడాదితో పోలిస్తే పత్తి ధర సగానికిపైగా తగ్గడంతో... దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతులు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే తమను ఆదుకోవాలని కోరుతున్నారు.
'పరకాల మార్కెట్‌యార్డులో గత సంవత్సరం దాదాపు ఒక లక్ష పది వేల క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేశాము. దాంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం 60 శాతం మాత్రమే పత్తి మార్కెట్‌కు విక్రయానికి వచ్చింది. పత్తి దిగుబడి పెరిగింది. కానీ గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల రైతులందరూ పత్తిని ఇళ్లలో నిల్వచేసుకుంటున్నారు.' - బండి సారంగపాణి, ఛైర్మన్ పరకాల వ్యవసాయ మార్కెట్
ఇవీ చదవండి: