విద్యార్థులకు రోజూ మధ్యాహ్న భోజనానికి అందించే బియ్యాన్ని పౌర సరఫరాల శాఖ నుంచి అందిస్తుంటారు. గోదాం నుంచి పాఠశాలకు బియ్యం బస్తాలను చేర్చే బాధ్యతను ఒక కాంట్రాక్టర్ చూసుకుంటారు. ఈ క్రమంలో వాహనంలో పాఠశాలకు వచ్చిన బస్తాలను కూలీల ద్వారా కాకుండా... ఆ పాఠశాలలో చదివే విద్యార్థులతోనే లోపలికి మోపిస్తున్నారు. ఇది వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట్ ప్రభుత్వ బాలబాలికల ఉన్నత పాఠశాలలో జరిగింది.
బియ్యం బస్తాలు వచ్చిన ప్రతిసారీ తమతోనే మోపిస్తారని విద్యార్థులు తెలిపారు. సదరు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాజేందర్ వారి దగ్గరే ఉండి మరీ బస్తాలు మోపిస్తున్నారు. చదువుకునే విద్యార్థుల చేత ఇలా పని చేయించడం ఏంటని ఆయనను వివరణ కోరగా... కాంట్రాక్టర్ కూలీలను పంపడం లేదని ఒకసారి సమాధానమిచ్చారు. మరోసారి ఉపాధ్యాయులు పనిలో ఉన్నారంటూ... పొంతనలేని సమాధానాలు చెబుతుండడం గమనార్హం.

ఇదీ చదవండి: రాజకీయ పార్టీ విషయంలో త్వరలో నిర్ణయం: ఆర్.కృష్ణయ్య