వరంగల్ అర్బన్ జిల్లా ఎల్కతుర్తిలో నిర్మించనున్న పట్టణ ప్రకృతి వనానికి రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ భూమిపూజ చేశారు. ప్రకృతి వనాన్ని తెలంగాణ టూరింజం కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు.
రైతులు పండించిన ధాన్యాన్ని వారే అమ్ముకునే అవకాశం కల్పించాలనే సన్నరకం వడ్లు పండించాలని నిర్ణయించామన్నారు. భాజపా నాయకులు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని... రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో పది శాతం కూడా కేంద్రం వాటా లేదన్నారు. కాంగ్రెస్ పాలకులైతే 50 ఏళ్ల పాటు బోరునీళ్లు తాపిచ్చి కిడ్నీలో రాళ్లు, మోకాలు చిప్పలు అరగడానికి కారణమయ్యారని ఎద్దేవా చేశారు.
ప్రభుత్వ సూచనలపై రైతులు సన్నరకం వడ్లు పండించారని... వాటికి మద్దతు ధరను నిర్ణయించే విషయమై సీఎం కేసీఆర్ త్వరలోనే నిర్ణయం తీసుకుంటారన్నారు. దొడ్డు రకం పండిస్తే ప్రభుత్వం కొనుగోలు చేసినా వాటిని ఎవ్వరూ తినడం లేదని... వాటిని ప్రైవేటు వ్యక్తులు అక్రమ మార్గంలో తరలిస్తున్నారని ఆరోపించారు. అందువల్లనే సన్నరకం వడ్లు పండించాలని సూచించామన్నారు. భవిష్యత్తులో అధిక దిగుబడినిచ్చే సన్న రకం వరి విత్తనాలను అందించడానికి ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పరిశోధనలు జరుగుతున్నాయని వెల్లడించారు.
ఇదీ చూడండి: వరద బాధితుల ఇళ్ల వద్దకే వెళ్లి సాయం అందిస్తాం: మంత్రి తలసాని