Sarpanch Doughter Love Marriage Video : కుమార్తె ప్రేమ వివాహం చేసుకోవటంతో ఆగ్రహానికి గురైన ఓ సర్పంచ్.. నానా బీభత్సం సృష్టించాడు. బిడ్డను వివాహం చేసుకున్న యువకుడి ఇంటితో పాటు పెళ్లికి సహకరించారన్న నెపంతో స్నేహితుల ఇళ్లపై దాడి చేసి, దగ్ధం చేశాడు. వరంగల్ జిల్లా నర్సంపేటలో ఈ ఘటన చోటుచేసుకుంది. నర్సంపేట ఏసీపీ తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లాలోని నర్సంపేట ఇటికాలపల్లి గ్రామ సర్పంచ్ మండల రవీందర్ కుమార్తె కావ్యశ్రీ.. అదే గ్రామానికి చెందిన జలగం రంజిత్ కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. హసన్‌పర్తిలో ఓ హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్న కావ్య.. ఇంట్లో చెప్పకుండా రంజిత్‌తో వెళ్లిపోయి ప్రేమవివాహం చేసుకుంది.
Itikala palli Sarpanch Attack Video : తల్లిదండ్రుల ఫిర్యాదుతో హసన్‌పర్తి పోలీసులు ఇద్దరినీ స్టేషన్‌కు రప్పించి మాట్లాడారు. ఎంత బతిమిలాడినా కుమార్తె రాకపోవటంతో సర్పంచ్ రవీందర్ ఆగ్రహానికి గురయ్యాడు. ఈ క్రమంలోనే తన అనుచరులతో కలిసి రంజిత్ ఇంటిపై దాడి చేశాడు. అలాగే ప్రేమ వివాహానికి సహకరించారంటూ రంజిత్ స్నేహితుల ఇళ్లపై దౌర్జన్యం చేసి, ఇళ్లకు నిప్పు పెట్టారు. ఇళ్లలో ఉన్న వారు భయభ్రాంతులకు గురై, పరుగులు తీశారు. సర్పంచ్ తీరుతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ విషయం స్థానికుల ద్వారా తెలుసుకున్న పోలీసులు ఆ గ్రామానికి వచ్చి.. జరుగుతున్న అల్లర్లను అదుపులోకి తీసుకొచ్చారు. గ్రామంలో ఎలాంటి అల్లర్లు జరగకుండా పికెటింగ్ ఏర్పాటు చేశారు. ఈ విషయంపై కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
"నా ఇష్టపూరకంగానే నేను పెళ్లి చేసుకున్నాను. నన్ను ఎవ్వరు ఇబ్బంది పెట్టలేదు. మీరు ఇబ్బంది పడకండి. నావల్ల ఎవ్వరిని సమస్యలోకి నెట్టకండి. నేను పెళ్లి చేసుకున్న వ్యక్తితో సంతోషంగానే ఉన్నాను. ఇకపై కూడా ఆనందంగానే ఉంటా. నా కోసం ఎక్కడా వెతకకండి. నా కోసం ఎవ్వరినైనా ఇబ్బంది పెడితే.. నేను చనిపోడానికైనా సిద్ధంగా ఉన్నాను."- సర్పంచ్ కుమార్తె
"కొంత మంది వ్యక్తులు ఐదు వాహనాల మీద వచ్చి యువకుడి ఇంటిని తగలబెట్టారు. ఇటుకాలపల్లి గ్రామానికి చెందిన ఒక అమ్మాయి, అబ్బాయి కనిపించలేదని జూన్30న హాసన్ పర్తి పోలీసు స్టేషన్‌లో మిస్సింగ్ కేసుగా నమోదు చేశాం. దీంతో ఇరువురి కుటుంబ సభ్యులను పిలిపించి కౌన్సిలింగ్ చేసి పంపించాం. ఇప్పుడు వారి ఇళ్లలను కొంత మంది వ్యక్తులు కిరోసిన్ వేసి దగ్ధం చేశారు. దీని మీద కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేస్తున్నాం."- సంపత్ రావు, నర్సంపేట ఏసీపీ
"సర్పంచ్ తరుఫు వ్యక్తులు ఐదు బైక్‌ల మీద వచ్చి.. మా ఇంటిపై దాడి చేశారు. మా ఇంట్లో ఉన్న వస్తువులు అన్ని పగలగొట్టి, దేనికి పనికి రాకుండా నాశనం చేశారు. ఇంట్లో పత్తి పెట్టుకున్నాం అది అంతా దగ్ధం అయిపోయింది."-స్వప్న, రంజిత్ స్నేహితుడి సోదరి
ఇవీ చదవండి :