ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన తమ బిడ్డల కోసం... తల్లిదండ్రుల ఎదరుచూపులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా కర్ణాటక విద్యార్థి మరణంతో... ఎప్పుడు ఏం జరుగుతోందోనని ఇక్కడివారు తల్లడిల్లుతున్నారు. హనుమకొండకు చెందిన అఖిల్ సాయి...ఉక్రెయిన్లో వైద్య విద్యను అభ్యసిస్తున్నాడు. యుద్ధం కారణంగా గత వారం అంతా బిక్కు బిక్కు మంటూ గడిపిన అఖిల్... ప్రాణాలను అరచేత్తో పట్టుకుని హంగేరి సరిహద్దు ప్రాంతానికి వచ్చాడు. కుమారుడి... రాక కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నానని సాయి తల్లి చెపుతోంది. తమ బిడ్డ క్షేమంగా ఇంటికి వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతోంది.
'తిండి లేదు. నిద్రలేదు. కర్ణాటక అబ్బాయి చనిపోయే సరికి మాకు ఇంకా టెన్షన్ ఎక్కువైంది. మా అబ్బాయి వచ్చేంత వరకూ భయమే. బార్డర్ వరకు వచ్చానని చెప్పాడు. ఇంకా ఏం తెలుస్తలేదు. మా బాబును సురక్షితంగా తీసుకురావడానికి ప్రభుత్వాలు ఏమైన చేయాలి.' - మాలతి, అఖిల్ తల్లి
'రిస్క్ చేసి బయటకు వచ్చారు. వాళ్లు వచ్చిన తర్వాత అక్కడి పరిస్థితి దారుణంగా తయారైంది. వీళ్లు ఉంటున్న బిల్డింగ్పై మిసైల్ పడి పైన ఫ్లోర్ కూలిపోయింది. లక్కిగా మా అన్నయ్య బయటపడ్డాడు. గత నాలుగైదు రోజుల నుంచి మాక్కూడా నిద్రలేదు. వాళ్లకు ఫుడ్లేదు. డబ్బులు లేవు. డబ్బులు పంపేందుకు అవకాశం లేదు. ఇవాళ హంగేరికి వచ్చారు. ఇండియన్ ఎంబసీ వాళ్లు పిక్ అప్ చేసుకుంటా అన్నారు.' - నిఖిల్ సాయి, అఖిల్ తమ్ముడు
ఇదీ చదవండి : ఉక్రెయిన్- రష్యా యుద్ధంలో భారతీయ విద్యార్థి మృతి
'తినేందుకు తిండిలేక పిల్లలు అలమటిస్తున్నారు'.. భావోద్వేగంలో విద్యార్థుల తల్లిదండ్రులు