చిట్టి డబ్బులు అడిగిన వ్యక్తిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు భార్యాభర్తలు. హనుమకొండ జిల్లాకు చెందిన రాజు అనే మొబైల్ దుకాణ యజమాని.. ఓ చిట్ ఫండ్ సంస్థలో చిట్టి వేశాడు. ఈ చిట్టిలో ఒకరైన ఏజెంట్ గణేష్.. డబ్బులు ఎత్తుకున్నాడు. కానీ.. కొన్ని నెలలుగా కిస్తీలు కట్టటం మానేశాడు. పలుమార్లు గణేష్‌ను రాజు మందలించినా.. లాభం లేదు. గురువారం రోజు చిట్ ఫండ్ కంపెనీ వద్దకు వెళ్లి గణేష్‌పై మండిపడ్డాడు. డబ్బులు కట్టాలని గట్టిగా అరిచాడు.
భర్త డైరెక్షన్లో భార్య...
ఈ ఘటనను అవమానంగా భావించిన గణేష్.. రాజుపై కోపం పెంచుకున్నాడు. ఎలాగైనా రాజుపై ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు. తన భార్య కావ్యకు పెట్రోల్ నింపిన బాటిల్ ఇచ్చాడు. నగరంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదురుగా ఉన్న రాజు మొబైల్ దుకాణానికి పంపించాడు. భర్త చెప్పినట్టే దుకాణానికి వెళ్లిన భార్య.. చేతిలో ఉన్న బాటిల్లోని పెట్రోల్‌ను రాజుపై పోసి.. అంటించింది. ఏం జరుగుతుందో తెలుసుకునేటప్పటికే.. రాజుకు మంటలంటుకున్నాయి. రాజు కేకలు విన్న స్థానికులు కాపాడే ప్రయత్నం చేశారు. అప్పటికే రాజు తీవ్రంగా గాయపడ్డాడు. రాజును కాపాడేక్రమంలో అతడి భార్యకు, మరో వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి.
దుకాణంలో కౌంటర్‌పై కూర్చున్న రాజుపై పెట్రోల్ పోసి అంటించటం వల్ల షాపులోనూ మంటలు చెలరేగాయి. పోలీసులకు సమాచారమివ్వగా.. హుటాహుటిన అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలు అదుపు చేశారు. క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. దుకాణానికి చేరుకున్న పోలీసులు ఘటనను పరిశీలించారు. స్థానికులతో మాట్లాడి వివరాలు సేకరించారు.
ఇదీ చూడండి: