సాయుధ రైతాంగ పోరాటానికి కొనసాగింపే కాంగ్రెస్ రైతు సంఘర్షణ సభని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అభివర్ణించారు. చనిపోయిన రైతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోలేదని ఆరోపించారు. లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని అధికారంలోకి వచ్చి... అమలు చేయలేదని మండిపడ్డారు. రైతులు వరి వేస్తే ఉరే అని కేసీఆర్ అన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మే 6న వరంగల్‌లో జరిగే రైతు సంఘర్షణ సభ ఏర్పాట్లను రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు పరిశీలించారు.
రైతు సంఘర్షణ సభను విజయవంతం చేయాలని కాంగ్రెస్ శ్రేణులకు రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. రాహుల్ సభకు అన్ని దార్లు ఓరుగల్లు వైపే అన్నట్లుగా కదలాలని సూచించారు. ఓరుగల్లులో సభ పెట్టాలని సోనియా, రాహుల్ సూచించారని చెప్పారు. ఇది ఎన్నికల కోసం పెడుతున్న సభ కాదని రాహుల్ చెప్పారని రేవంత్‌రెడ్డి వెల్లడించారు. తెలంగాణ పరిస్థితులపై రాహుల్‌గాంధీకి అపారమైన అవగాహన ఉందని అన్నారు.
రైతులు, అమరవీరుల కోసం సభ ఏర్పాటు చేస్తున్నామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఓరుగల్లు సభకు బండి పెట్టం.. బువ్వ పెట్టమని స్పష్టం చేశారు. ప్రతి బూత్ నుంచి 9 మంది చొప్పున కదిలిరావాలని అన్నారు. ప్రతి 3నెలలకు రాహుల్‌గాంధీ తెలంగాణకు వస్తారని చెప్పారు. రాష్ట్ర ఏర్పాటులో కాంగ్రెస్ పాత్ర.. తెరాస పాత్రపై చర్చకు వస్తారా? అని సవాల్ విసిరారు. కేసీఆర్‌ను గద్దె దించే బాధ్యత యువకులు తీసుకోవాలని చెప్పారు.
‘రైతులు ప్రైవేటు అప్పులు తీసుకొచ్చి వడ్డీలు కట్టలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. గిట్టుబాటు ధర లేక, ప్రభుత్వం పంటలు కొనక రైతులు బలవన్మరణాలకు పాల్పడతున్నారు. మిర్చి పంటకు తెగులు సోకి నాశనమవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. నిజామాబాద్ జిల్లాలో చెరుకు ప్యాక్టరీలు మూసేశారు. పసుపు పంటలు కొనకపోవడంతో రైతులు తప్పని పరిస్థితుల్లో వరి వైపు మళ్లారు. పత్తి పండిస్తే నష్టం వస్తుందని ప్రచారం చేస్తే వారు కూడా వరి వైపే మళ్లారు.’ - రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు
ఇదీ చదవండి : ఆ జీవో చెల్లదు.. అందుకోసమే కొత్త డ్రామా: రేవంత్ రెడ్డి
మంత్రి రోజా ఫోన్ మిస్సింగ్.. మూడు బృందాల గాలింపు.. ఎట్టకేలకు..!