కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్(Errabelli) తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈనెల 21న వరంగల్‌కు రానున్నారని పేర్కొన్నారు. హన్మకొండలో నూతనంగా నిర్మిస్తున్న వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ కార్యాలయం, వరంగల్ సెంట్రల్ జైలు ఆవరణలో 24 అంతస్తుల మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారని మంత్రి చెప్పారు.
హన్మకొండలో నూతన హంగులతో నిర్మిస్తున్న కలెక్టర్ భవన సముదాయాన్ని వరంగల్ మేయర్, ఎమ్మెల్యే నరేందర్, ఎంపీ బండా ప్రకాశ్‌తో కలిసి పరిశీలించారు. కలెక్టర్ భవన సముదాయాల్లో కలియ తిరుగుతూ చాలా బాగుందని సంతోషం వ్యక్తం చేశారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా అన్ని కార్యాలయాలు ఒకే దగ్గర ఉండేందుకు సమీకృత కార్యాలయాల నిర్మాణం ప్రభుత్వం చేపట్టిందని తెలిపారు.
ముఖ్యమంత్రి వరంగల్‌కు వచ్చిన రోజు వరంగల్ రూరల్, అర్బన్ జిల్లాల పేర్లపై సమీక్షిస్తామని తెలిపారు. అందరి అభిప్రాయం మేరకే వరంగల్ రూరల్‌కు వరంగల్, వరంగల్ అర్బన్‌కు హన్మకొండ జిల్లాగా పేరు మార్పుపై పరిశీలిస్తామని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ పర్యటన సందర్భంగా ప్రజలంతా చప్పట్లతో అభినందించాలని కోరారు.
ఇదీ చదవండి: Etela : హైదరాబాద్ చేరుకున్న ఈటల బృందం