Paddy new breed : వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం నుంచి మరో కొత్త రకం వరి వంగడం విడుదలైంది. బీపీటీ-5204 వరి రకానికి ప్రత్యామ్నాయంగా వరంగల్ శాస్త్రవేత్తలు నాలుగేళ్ల పాటు పరిశోధనలు చేసి డబ్ల్యూజీఎల్-962 అనే వరి వంగడాన్ని రూపొందించారు. విత్తనాలు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో రైతులకు విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నాయని.. 25 కిలోల బస్తాను రూ.1100కు విక్రయిస్తున్నట్లు పరిశోధనా కేంద్రం సహాయ సంచాలకుడు డాక్టర్ ఆర్.ఉమారెడ్డి తెలిపారు.
డబ్ల్యూజీఎల్-962 రకం లక్షణాలు: ఇది మధ్య సన్నగింజ రకం. బీపీటీ-5204 కంటే 20-25 రోజుల ముందుగానే పంట కోతకు వస్తుంది. మొక్క నిటారుగా మధ్యస్థ ఎత్తు (90-105 సెం.మీ) పెరిగి పైరు వాలకుండా ఉంటుంది. ఈ రకం దిగుబడి సామర్థ్యం హెక్టారుకు 6.5 నుంచి 7.5 టన్నులు. అగ్గితెగులు, కాండం తొలుచు పురుగును కొంత వరకు తట్టుకుంటుంది. అన్నం రుచిగా పొడిపొడిగా ఉంటుంది. ఎదిగే దశలో పైరు నుంచి గింజ రాలదు.