వరంగల్ ఎంజీఎంలో రెమ్డెసివిర్ ఇంజక్షన్‌లు, ఫ్లోమీటర్లు మాయమడంపై ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ విచారణకు ఆదేశించారు. రోగులకు ఇచ్చినట్లుగా కేస్‌షీట్లు తయారు చేసి.. ఇంజెక్షన్లు ఫ్లోమీటర్లను కొందరు.. అక్రమంగా ప్రైవేటు దవాఖానాలకు తరలించి సొమ్ము చేసుకున్నారు. ఎంజీఎంకు ఈ మధ్య 6వేల378 ఇంజెక్షన్లు రాగా.. అందులో చాలావరకు బయట విక్రయించారని తెలుస్తోంది. రోగులకు అత్యవసరమైన ఫ్లోమీటర్లలోనూ కొంతమంది చేతివాటం కనిపిస్తోంది.
గతేడాది మార్చి కొవిడ్ ప్రారంభంలో 11 వందలకు పైగా ఫ్లోమీటర్లు ఉండగా.. వాటి సంఖ్య ప్రస్తుతం 400కి తగ్గిపోయింది. ఇదే అదనుగా కొందరు బాధితుల బంధువుల నుంచి మూడు వేలకు వరకు వసూలు చేశారు. రెమ్డెసివిర్ ఇంజెక్షన్లు, ఆక్సిజన్ ఫ్లోమీటర్లు మాయమవడంపై ఎంజీఎం సూపరింటెండెంట్ విచారణకు ఆదేశించారు. సీనియర్ ప్రొఫెసర్లతో ఎక్స్‌పర్ట్ కమిటీని ఏర్పాటు చేశారు. రెండు నెలలుగా ఆసుపత్రికి వచ్చిన ఇంజెక్షన్లు కేస్‌షీట్లో నమోదు చేసిన వివరాలను సరిచూస్తున్నారు. బాధితులతో మాట్లాడి వాస్తవాలను తెలుసుకుంటుండగా అక్రమాలకు పాల్పడినవారు బయటపడే మర్గాలను వెతుకున్నారు.