Minister Harish Rao speech in Parkala: ఎన్నికల్లో ఇవ్వని హామీలను కూడా అమలు చేస్తున్న ఘనత.. సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. రైతు బంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మీ పథకాలతో దేశానికే ఆదర్శంగా నిలిచిందని వెల్లడించారు. హనుమకొండ జిల్లా పరకాలలో రూ. 35 కోట్లతో 100 పడకల ఆస్పత్రికి మంత్రి హరీశ్‌రావు శంకుస్థాపన చేశారు. అంతకుముందుగా ములుగులో జిల్లా ఆస్పత్రితో పాటు నర్సంపేటలో 250 పడకల ఆస్పత్రికి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన ప్రభుత్వ కళాశాలలో నిర్వహించిన బహిరంగ సభలో హరీశ్ మాట్లాడారు.
నీటి తీరువా లేదు
రైతు బంధు ద్వారా ఇప్పటివరకు రైతుల ఖాతాల్లో రూ.50 వేల కోట్లు జమ చేసినట్లు హరీశ్ అన్నారు. పైరవీలు లేకుండా నేరుగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నామని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలో దళారులు, మధ్యవర్తులే లాభపడ్డారని విమర్శించారు. 24 గంటల నాణ్యమైన విద్యుత్‌తో పాటు.. నీటి తీరువా లేకుండా కాలువ నీరిచ్చే ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని స్పష్టం చేశారు. పేదింటి ఆడపడుచుల పెళ్లిళ్లకు ఇప్పటివరకు కల్యాణలక్ష్మి పథకం ద్వారా రూ.9 వేల కోట్లు ఇచ్చినట్లు వివరించారు.
"కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. తెలంగాణ పథకాలను.. కేంద్రం, ఇతర రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. ఇవ్వని హామీలను కూడా అమలు చేస్తున్న ఘనత కేసీఆర్‌ది. భాజపా పాలిత రాష్ట్రాల్లో ఉచిత విద్యుత్ లేదు. కేవలం తెలంగాణలో మాత్రమే 24 గంటలూ ఉచిత విద్యుత్ ఇస్తున్నాం." -హరీశ్ రావు, వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి
కేంద్రం ఆఫర్ ఇచ్చింది
రాష్ట్రంలో విద్యుత్ సంస్కరణలు అమలు చేస్తే ఐదేళ్లలో రూ. 25 వేల కోట్లు ఇస్తామని కేంద్రం ఆఫర్ ఇచ్చిందని మంత్రి హరీశ్ తెలిపారు. కేంద్రం చెప్పిన దానికి తల ఊపి.. ఏపీ ప్రభుత్వం శ్రీకాకుళం జిల్లాలో మోటర్లకు మీటర్లు పెట్టిందని వెల్లడించారు. కానీ సీఎం కేసీఆర్ మాత్రం.. మోటర్లకు మీటర్లు పెట్టేదిలేదని తేల్చి చెప్పారని స్పష్టం చేశారు. మహిళలకు వడ్డీ లేని రుణాలను ఈనెలలో విడుదల చేస్తామని హరీశ్ రావు వెల్లడించారు. విభజన హామీల అమలులో కేంద్రం విఫలమైందన్న ఆయన... విద్యుత్ సంస్కరణల పేరిట కుట్రలకు పాల్పడుతోందని ఆరోపించారు. గిరిజన విశ్వవిద్యాలయంలో గిరిజనులకు ఏడున్నర శాతం మాత్రమే రిజర్వేషన్లు ఇవ్వాలన్న కేంద్రం నిర్ణయంపై మండిపడ్డారు. సబ్సీడీల్లో కోతలు విధిస్తూ కేంద్రం ధరలను పెంచుతోందని హరీశ్ రావు మండిపడ్డారు.
"తెలంగాణలో విద్యుత్ సంస్కరణలు అమలు చేస్తే.. ఐదేళ్లలో రూ. 25 వేల కోట్లు ఇస్తామని కేంద్రం ఆఫర్ ఇచ్చింది. అందుకోసం బావులు, బోర్ల వద్ద మీటర్లు పెడితే ఏడాదికి రూ. 5 వేల కోట్లు ఇస్తామన్నారు. మీటర్లు పెడితేనే డబ్బులు ఇస్తామని చెప్పారు. కానీ రూ.25 వేల కోట్లు వద్దు.. మీటర్లూ వద్దని కేంద్రానికి కేసీఆర్ స్పష్టం చేశారు. కేంద్రం చెప్పిందని ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో సీఎం జగన్ మీటర్లు పెట్టారు. కానీ మీటర్లు పెట్టే ప్రసక్తి లేదని సీఎం కేసీఆర్ చెప్పారు." -హరీశ్ రావు, వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి
మళ్లీ పెంచుతారు
భాజపా అధికారంలోకి రాకముందు సిలిండర్ ధర రూ.400 ఉండేదని హరీశ్ అన్నారు. ఇప్పుడు సిలిండర్ ధర రూ.వెయ్యి చేసి రూ.40 రాయితీ ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. మున్ముందు మరో రూ.వంద పెంచుతారని జోస్యం చెప్పారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం వల్ల రైతులపై అధిక భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: తెలంగాణలో ఆక్సిజన్ అందక ఒక్కరు కూడా చనిపోలేదు: కేటీఆర్