Errabelli Comment's on Telangana Next CM: తెలంగాణ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి కేటీఆరే అని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రం అనేక రంగాల్లో అభివృద్ధి సాధించిందని.. ఇండస్ట్రీస్, ఐటీ సంస్థలు ఎన్నో వచ్చాయని తెలిపారు. ఈ నెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం ఏనుగల్లులో నిర్వహించబోయే బహిరంగ సభ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా మంత్రి కేటీఆర్ హాజరవుతారని.. సభ సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లను జాగ్రత్తగా చేస్తున్నట్లు స్పష్టం చేశారు.
ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ తర్వాత కేటీఆరే అంతటి సమర్థవంతమైన నాయకుడని మంత్రి ఎర్రబెల్లి అభిప్రాయపడ్డారు. తెలంగాణకు కాబోయే సీఎం కేటీఆరే అని స్పష్టం చేశారు. అయితే ఎర్రబెల్లి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
"కేటీఆర్ కాబోయే ముఖ్యమంత్రి. సబ్జెట్ ఉన్న వ్యక్తి కాబట్టే ఈ రోజు మన తెలంగాణ రాష్ట్రానికి పరిశ్రమలు, ఐటీ పరిశ్రమలు వస్తున్నాయి. కేటీఆర్ నాయకత్వంలో ఏ రాష్ట్రానికి రాని పెట్టుబడులు మన రాష్ట్రానికి వస్తున్నాయి. నిరుద్యోగ యువకులకు కూడా చాలా ప్రోత్సాహకాలు అందుతున్నాయి. వరంగల్లో కూడా పెద్ద ఎత్తున ఐటీ కంపెనీలు రావడం వారి ప్రోత్సాహకంతోనే జరుగుతున్నాయి."-ఎర్రబెల్లి దయాకర్ రావు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి
Women's Day Celebrations In Warangal: మహిళా దినోత్సవం సందర్భంగా మంత్రి కేటీఆర్ వరంగల్ రానున్న సందర్భంగా సభా ప్రాంగణంలో హెలీ ప్యాడ్, సభా స్థలం, పార్కింగ్ స్థలంతో పాటు ఇతర ఏర్పాట్లను పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ సోమవారం పరిశీలించారు. ప్రతిమ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాన్ని మంత్రి కేటీఆర్ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రారంభిస్తారని తెలిపారు. అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని.. ఈ సేవలను వినియోగించుకోవాలని మంత్రి ఎర్రబెల్లి వివరించారు.
రాష్ట్రవ్యాప్తంగా జరగనున్న మహిళా దినోత్సవ కార్యక్రమాలు: రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ వారోత్సవాల్లో వివిధ కార్యక్రమాలను పురపాలక శాఖ నిర్వహించి.. పలువురిని సత్కరించనున్నారు. మహిళలకు క్రీడా కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, వారి ఆరోగ్యం గురించి హెల్త్ క్యాంపులు నిర్వహించనున్నారు. వివిధ రంగాల్లో రాణిస్తున్న, అత్యుత్తమ ప్రదర్శన చేసిన మహిళలను సన్మానించనున్నారు.
ఇవీ చదవండి: