వరంగల్ నగర సమగ్రాభివృద్ధికి చేపడుతున్న పనులను సత్వరమే పూర్తి చేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులను ఆదేశించారు. హన్మకొండలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో రాష్ట్ర పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్‌తో కలిసి పలు అభివృద్ధి పనులపై సమీక్షించారు.
ఉగాది నుంచి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇంటింటికీ ప్రతి రోజూ నల్లాల ద్వారా నీరు అందించేందుకు కృషి చేయాలని మంత్రి దయాకర్ రావు అధికారులకు సూచించారు. అందుకోసం మార్చి 1న నీటి సరఫరాకు ట్రయల్ రన్ నిర్వహించాలని ఆదేశించారు. నగరంలోని అంతర్గత రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులను మరింత వేగంగా పూర్తి చేయాలన్నారు.
నగర సుందరీకరణలో భాగంగా మొత్తం 33 జంక్షన్లను అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో వరంగల్ మేయర్ గుండా ప్రకాష్ రావు, ఎమ్మెల్యేలు నన్నపనేని నరేందర్, అరూరి రమేష్, వరంగల్ అర్బన్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, కమిషనర్ పమేలా సత్పతి, కార్పొరేషన్‌లోని ఆయా విభాగాల అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: 'వంటిమామిడిలో 50 ఎకరాల్లో కోల్డ్ స్టోరేజ్‌లు ఏర్పాటు చేస్తాం'