2031 తర్వాతే తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన చేస్తామంటూ కేంద్రం ప్రకటన చేయడాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ తప్పుపట్టారు. తెలుగు రాష్ట్రాలపై అణగదొక్కే వైఖరి అవలంభిస్తోందనడానికి ఇదే నిదర్శనమని.. హన్మకొండలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో వారు మండిపడ్డారు.
భాజపా నేతలు రాజీనామా చేయాలి..
తొలి నుంచి ఉత్తరాది రాష్ట్రాలపైనే కేంద్ర ప్రభుత్వం ప్రేమ కనబరుస్తోందని ఎర్రబెల్లి ఆరోపించారు. విభజన చట్టంలో ఉన్నదానినే తాము అమలుచేయాలని కోరుతున్నామని స్పష్టం చేశారు. రాష్ట్ర భాజపా నేతలకు ధైర్యం ఉంటే ఈ అంశంపై కేంద్ర పెద్దలను నిలదీయాలని లేకుంటే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుంటే ఉద్యమం తప్పదని హెచ్చరించారు.
మీకేంటి ఇబ్బంది..
తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాలు పెరిగితే.. కేంద్రానికి వచ్చే నష్టమేంటని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు ప్రశ్నించారు. కశ్మీర్‌కో న్యాయం తెలుగు ప్రజలకు ఇంకో న్యాయమా అని నిలదీశారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే కశ్మీర్లో సీట్లు పెంచే ప్రతిపాదనలు చేస్తున్నారని విమర్శించారు.
రేవంత్ ప్రశ్నతో..
'ఏపీ విభజన చట్టం ప్రకారం తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 119 నియోజకవర్గాలను 153 నియోజకవర్గాలుగా పెంచాల్సిన అవరం ఉంది.. ఎప్పుడు పెంచుతారు?' అంటూ లోక్‌సభలో రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. దీనికి కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద్ రాయ్ సమాధానం ఇచ్చారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 170లో చెప్పినట్లు 2026 తర్వాత ప్రచురించే జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని నిత్యానంద్ రాయ్ తెలిపారు. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే తెలంగాణలోని 119 నియోజకవర్గాలను 153కు పెంచుతారు. ఏపీలో ప్రస్తుతం ఉన్న 175 నియోజక వర్గాలను 225కు పెంచుతారు.
పెద్దఎత్తున ఉద్యమిస్తాం..
'సీట్లు పెరిగితే మీకు ఇబ్బంది ఏంటి.. రాజకీయంగా మీకు ఉనికి లేదనే కదా పెంచుతలేరు. ఈ అంశంపై తెలంగాణ రాష్ట్ర భాజపా వైఖరి బయటపెట్టాలి. పార్లమెంట్లో విభజన చట్టం అమలు చేస్తూ నిర్ణయం తీసుకోవాలి.. లేకుంటే పెద్దఎత్తున ఉద్యమిస్తాం. కేంద్రం దిగొచ్చేదాక మా పోరాటం ఆగదు.'
- ఎర్రబెల్లి దయాకరరావు, రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి
ఒకే దేశం.. ఒకే న్యాయం ఉండాలి కదా..
'కశ్మీర్లో సీట్లు పెంచుతున్నప్పుడు.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు ఎందుకు పెంచరు. రేవంత్‌రెడ్డి ప్రశ్న వేస్తే తప్పించుకున్నారు. కశ్మీర్లో ఎందుకు పెంచుతున్నారు.. తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు పెంచడం లేదో రేవంత్‌రెడ్డి కూడా సక్కగా ప్రశ్న వేయలేదు. ఒకే దేశం ఒకే న్యాయం ఉండాలి కదా.. కశ్మీర్‌కు ఒకటి తెలుగు ప్రజలకు ఇంకో న్యాయం ఉంటదా.'
- వినోద్‌కుమార్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు
ఇదీచూడండి: AP and TS: తెలుగు రాష్ట్రాల నియోజకవర్గాల పునర్విభజన అప్పుడే!