వరంగల్ మహా నగరపాలక సంస్థ, ఖమ్మం నగరపాలికతోపాటు సిద్దిపేట, అచ్చంపేట, జడ్చర్ల, నకిరేకల్, కొత్తూరు పురపాలక సంఘాలకు మేయర్, ఛైర్‌పర్సన్ల ఎన్నిక నేడు జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారం, అనంతరం 3.30 గంటలకు మేయర్, చైర్‌పర్సన్ల పరోక్ష ఎన్నిక నిర్వహిస్తారు. ఇప్పటికే అభ్యర్థుల పేర్లతో కూడిన సీల్డ్ కవర్లను తెరాస అధిష్ఠానం... పార్టీ పరిశీలకులకు అందించింది. వరంగల్ మేయర్ పీఠాన్ని అధిష్టించేది ఎవరనేది ఇవాళ తేలిపోతుంది. 29వ డివిజన్ నుంచి పోటీకి దిగిన గుండు సుధారాణికి మేయర్ పీఠం ఖాయమన్న ప్రచారం ముందు నుంచి జరుగుతోంది.
నీరజ పేరు దాదాపుగా ఖరారు
ఖమ్మం ప్రథమ పౌరురాలిగా నీరజ పేరు దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. సిద్దిపేట మున్సిపాల్టీకి కడవెర్లు మంజుల, జడ్చర్లలో దోరెపల్లి లక్ష్మి, నకిరేకల్‌లో రాచకొండ శ్రీనుకు, అచ్చంపేటలో నర్సింహగౌడ్ లేదా శైలజకు ఛైర్ పర్సన్లు కుర్చీ దక్కే అవకాశం ఉందని తెరాస శ్రేణులు భావిస్తున్నాయి. డిప్యూటీ మేయర్, వైస్ ఛైర్‌పర్సన్ స్థానాల కోసం చాలా మంది పోటీ పడుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర సీనియర్ నేతలతో చర్చించి అభ్యర్థులను ఖరారు చేసినట్లు సమాచారం. పార్టీ పట్ల విధేయత, అనుభవం, సామాజిక సమీకరణలను పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
పరిశీలకులకు బాధ్యతలు
మేయర్, ఛైర్‌పర్సన్ల ఎంపిక ప్రక్రియ సజావుగా పూర్తయ్యేలా తెరాస ఎన్నికల పరిశీలకులు బాధ్యతలు నిర్వర్తించనున్నారు. వరంగల్‌కు మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, గంగుల కమలాకర్, ఖమ్మంకు మంత్రి ప్రశాంత్‌రెడ్డి, నూకల నరేశ్‌రెడ్డి పరిశీలకులుగా వ్యవహరిస్తున్నారు. కొత్తూరుకు మంత్రి తలసాని, నకిరేకల్‌కు రవీందర్‌రావు, సిద్దిపేటకు కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్, వంటేరు ప్రతాప్ రెడ్డి పరిశీలకులుగా ఉన్నారు.
విప్ జారీ
అచ్చంపేటకు మంత్రి నిరంజన్‌రెడ్డి, జడ్చర్లకు మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డిని పార్టీ అధిష్ఠానం పరిశీలకులుగా పంపించింది. నేడు ఉదయం కార్పొరేటర్లు, కౌన్సిలర్లతో సమావేశం కానున్న పరిశీలకులు... సీల్డు కవర్లు తెరిచి అధిష్ఠానం ఖరారు చేసిన పేర్లను వెల్లడిస్తారు. ప్రక్రియ సజావుగా పూర్తయ్యేలా కార్పొరేటర్లు, కౌన్సిలర్లకు విప్ జారీ చేస్తారు. పార్టీ నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండి.. ఏకగ్రీవంగా గెలిపించాలని దిశానిర్దేశం చేస్తారు. మిగతా వారికి భవిష్యత్తులో అవకాశాలు వస్తాయని భరోసా ఇవ్వాలన్న సీఎం ఆదేశాలను పరిశీలకులు వివరిస్తారు.
ఇదీ చదవండి: పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడిన మోదీ