వందలాది మంది పోలీసులు చుట్టుముట్టినా! కళ్లు మూసి తెరిచేలోపు మాయమయ్యేవాడు..
పక్కా సమాచారంతో బలగాలు ఆచూకీ కనుగొన్నా! ఎవరికీ దొరక్కుండా తప్పించుకొనేవాడు..
ఎన్ని ఆపరేషన్లు నిర్వహించినా! అవలీలగా బయటపడేవాడు...
అడవుల్ని అణువణువూ జల్లెడ పట్టినా! ఎక్కడా కానవచ్చేవాడు కాదు..
ఇక చిక్కాడు అనుకోగానే! చాకచక్యంగా జారుకొనేవాడు..
ఇన్ని విద్యలు ప్రదర్శించినా! కరోనాకు దొరికిపోయాడు..
యుద్ధాల నుంచి బయటపడ్డా! కొవిడ్‌తో పోరాడి ఓడిపోయాడు..
30 ఏళ్ల ఉద్యమ ప్రస్థానాన్ని! మహమ్మారి బారిన పడి ముగించాడు..
అత్యంత భద్రత
మావోయిస్టు పార్టీ అగ్రనేత నారాయణకు.. ఆ పార్టీ భారీ భద్రతను ఏర్పాటు చేసింది. యుద్ధంలో ప్రావీణ్యులను తయారు చేయడంలో కీలకనేతగా మారిన ఇతడిని కాపాడుకునేందుకు ఈ నిర్ణయం తీసుకొంది. పదేళ్ల కిందట మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పెద్దఎల్లాపూర్ గ్రామస్థులకు, న్యూడెమోక్రసీ అజ్ఞాత దళానికి జరిగిన ఘర్షణకు సంబంధించి హరిభూషణ్ వచ్చి పరిష్కరించినట్లు సమాచారం. ఆ సందర్భంలో మూడంచెల సెక్యూరిటీతో వచ్చినట్లు పోలీసు వర్గాలు అప్పట్లో పేర్కొన్నాయి. సుమారు 20 నుంచి 25 ఏళ్ల లోపు యువత రక్షణగా ఉంటూ కాపాడుకునేందుకు ప్రయత్నించారని సమాచారం.
గతేడాది అటవీశాఖ అధికారులతో పోడువ్యవసాయంపై నెలకొన్న వివాదం సందర్భంగా... గంగారం మండల అడవుల్లోకి వచ్చి సమస్యపై చర్చించినట్లు ప్రచారం జరిగింది. అప్పుడు అడవుల్లోకి అటవీశాఖ సిబ్బంది వెళ్లాలంటే భయపడిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇదే మండలంలోని కోమట్లగూడెంలో పదిహేనేళ్లకిందట తాటిచెట్ల పంపకాలపై గౌడకులస్థులకు, స్థానిక ఆదివాసీలకు జరిగిన గొడవలపై జోక్యం చేసుకుని వెంటనే పరిష్కరించినట్లు చెబుతారు.
అడవులపై పట్టు
ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని అడవులపై హరిభూషణ్‌కు మంచి పట్టుంది. అడవుల్లో పుట్టిపెరిగిన వ్యక్తి కావడం, ఉద్యమంలోకి వెళ్లినప్పటి నుంచి అడవులపై అవగాహన పెంచుకుని దళాల రక్షణకు వ్యూహాత్మకంగా చర్యలు చేపడుతూ ముందుకు వెళ్తుంటాడని ఆ పార్టీ సానుభూతి పరులు, మాజీలు పేర్కొంటున్నారు. ఎక్కడికెళ్లినా కాలినడకన ప్రయాణిస్తుంటాడని చెబుతారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని పలు జిల్లాల ప్రజలతో సత్సంబంధాలు ఎక్కువగా ఉంటాయని అంటారు. అక్కడి అడవుల్లోనే మిలటరీ శిక్షణ ఇస్తూ సభ్యులకు మెలకువలు నేర్పించేవాడని పోలీసు వర్గాలు భావించేవి.
ఉద్యమంలోనే భార్య
యాప నారాయణ భార్య సమ్మక్క అలియాస్ శారద అజ్ఞాతంలోనే కొనసాగుతోంది. కొత్తగూడ ఏరియా దళనేతగా కొనసాగిన సమయంలో 1992లో దళసభ్యురాలిగా ఉన్న సమ్మక్కను వివాహం చేసుకున్నారు. 2012లో ఆమె అనారోగ్యంతో జనజీవన స్రవంతిలోకి వచ్చింది. రెండేళ్లు బంధువులతో కలిసి గడిపి 2014లో మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లారు. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లో ఉన్నట్లు సమాచారం.
భారతక్క మృతదేహం
యుక్తవయసులో ఉద్యమబాట పట్టిన భారతక్క(Bharathakka) మూడున్నర దశబ్దాలుగా అజ్ఞాతజీవితం గడిపారు. పోలీసుల దాడుల నుంచి సురక్షితంగా తప్పించుకోవడంతోపాటు ప్రాణాలొడ్డి దళాన్ని రక్షించడంలో ముందుండేదని అంటారు. చాలా సందర్భాల్లో నాయకత్వ బాధ్యతలు అప్పగించేందుకు పార్టీ నిర్ణయించినా.. ఆరోగ్య సమస్యలను చెప్పి సున్నితంగా తప్పుకొనేదని ఆమె పరిచయస్థులు చెబుతారు.
వెన్నుదన్నుగా..
ఏటూరునాగారం ఏజెన్సీలో మావోయిస్టులు, కాల్వపల్లికి విడదీయరాని బంధం ఉంది. ఈ గ్రామం ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచింది. బడే నాగేశ్వర్‌రావు అలియాస్ ప్రభాకరన్న పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితుడై ఉద్యమబాట పట్టి జిల్లా కార్యదర్శి హోదాలో ఎన్‌కౌంటరయ్యారు. ఇతని సోదరుడు పున్నంచందర్ అలియాస్ మురళి ప్రభుత్వ ఉపాధ్యాయ వృత్తిని వదిలేసి ఉద్యమబాట పట్టి అమరుడయ్యారు. ఈ కుటుంబానికి చెందిన బడే ఊర్మిళ అనే యువతి సైతం నాలుగేళ్లక్రితం ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు విడిచారు. సిద్దబోయిన అశోక్, రొక్కల అశోక్ సైతం పార్టీలో కీలకపాత్ర వహించి అమరులయ్యారు. ఏడాది క్రితం భారతక్క కుమారుడు అభిలాష్, తాజాగా ఆమె మరణించారు.
ఒకే ఒక్కడు..
ఏటూరునాగారం ప్రాంతంలో మావోయిస్టు ఉద్యమానికి ఎందరో ఉద్యమకారులనందించిన కాల్వపల్లి నుంచి ఇక ఒకరు మాత్రమే మిగిలి ఉన్నారు. బడే చొక్కారావు అలియాస్ దామోదర్ 25 సంవత్సరాలుగా పార్టీలో క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు. దళసభ్యుడిగా చేరి ప్రస్తుతం కేకేడబ్ల్యూ కార్యదర్శి హోదాలో పార్టీని ముందుకు నడిపిస్తున్నారు.
విషాద ఛాయలు
సిద్దబోయిన భారతక్క అకాల మృతితో కాల్వపల్లిలో విషాదచాయలు అలుముకొన్నాయి. మూడు దశాబ్దాల క్రితం అజ్ఞాతంలోకి వెళ్లిన భారతక్క ఒకటి రెండు సందర్భాల్లో మాత్రమే గ్రామానికి వచ్చివెళ్లారు. ఉద్యమంలో భర్త, కుమారుడిని పోగొట్టుకొని తీరా ఆమె కూడా మృతిచెందటంపై గ్రామస్థులు విచారం వ్యక్తం చేస్తున్నారు. నెల రోజులక్రితం తల్లి ఎర్రక్క అనారోగ్యంతో చనిపోయింది.
ఇదీ చూడండి: mla seethakka: 'ఆయన ప్రజల మనిషి'