Aasara pension Scam in Mahabubabad : అర్హులైన నిరుపేదలు, వృద్ధులు, దివ్యాంగులకు అండగా ఉండేలా ప్రభుత్వం ఆసరా పథకం ద్వారా ప్రతి నెల పింఛన్లు ఇస్తోంది. దివ్యాంగులకు రూ.3016, మిగతా వారికి నెలకు రూ.2016 చొప్పున పింఛన్లు ఇవ్వడం జరుగుతోంది. ఈ ప్రక్రియను ప్రభుత్వం పోస్టల్ శాఖకు అప్పగించగా.. ఆయా సిబ్బంది గ్రామాల్లో అర్హులకు డబ్బులను అందిస్తున్నారు. ఇదిలా ఉండగా.. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలంలో మాత్రం మృతుల పేరిట పింఛన్లు స్వాహా అవుతున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
మండలంలోని గున్నేపల్లి పంచాయతీ పరిధిలో రెండు శివారు గిరిజన తండాలున్నాయి. అక్కడి గ్రామ జనాభా సుమారు 2130 మంది. ఇందులో ఓటర్లు 1500 మంది వరకు ఉన్నారు. ఆసరా పథకం ద్వారా నెలకు 308 మందికి ప్రభుత్వం పింఛన్లు అందిస్తోంది. వీరిలో వృద్ధాప్య పింఛన్లు తీసుకున్న వారి సంఖ్య 144, వితంతు 112, కల్లు గీత కార్మికులు 11, దివ్యాంగ 28, ఒంటరి మహిళలు 12, చేనేత 1 పింఛన్లు తీసుకుంటున్నారు. వీరిలో వేలి ముద్రలు పడని వారికి గ్రామ పంచాయతీ కార్యదర్శి వేలిముద్రల ద్వారా పింఛన్ తీసుకొనే సదుపాయం ప్రభుత్వం కల్పించింది.
గత రెండేళ్ల నుంచి సుమారు 30 మంది పింఛనుదారులు వివిధ కారణాలతో మృతి చెందారు. గ్రామంలో మృతి చెందిన వారి పేర్లను పంచాయతీ రికార్డుల్లో అధికారులు నమోదు చేయాలి. పింఛనుదారులు మృతి చెందితే.. వారి పేర్లు లిస్టు నుంచి తీసివేయాలి. కానీ అక్కడ అధికారులు అలా చేయలేదు. మృతి చెందిన వారిలో కొందరి పేరిట వస్తున్న పింఛను.. అధికారులు స్వాహా చేసినట్లు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. మండలంలోని గున్నేపల్లి, జయపురం గ్రామాలకు కేటాయించిన బయోమెట్రిక్ యంత్రాల సహాయంతో 30 మంది పేర్లతో సుమారు రూ.7 లక్షలకు పైగా సొమ్ము కాజేసినట్లు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.
Distribution Program of Aasara Pensions in Telangana : రెండేళ్ల నుంచి 4 జనవరి 2023 వరకు మృతి చెందిన వారు పింఛన్ పొందినట్లు గ్రామస్థులు వివరాలు సేకరించారు. అధికారులందరూ ఒక్కటై.. మృతుల పింఛన్ సొమ్ము స్వాహా చేశారని గ్రామస్థులు ప్రజావాణిలో కలెక్టర్, మండల ఎంపీడీవోకు ఫిర్యాదు చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు గురువారం గున్నేపల్లి పంచాయతీ కార్యాలయం ఎదుట గ్రామస్థులు ఆందోళనకు దిగారు.
ఇవీ చదవండి: