ప్రియుడితో పెళ్లి జరగాలని 8 రోజులుగా ప్రియుడి ఇంటి ఎదుట చేస్తున్న ప్రియురాలి దీక్షకు.. వివాహంతో తెరపడింది. వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ పరిధిలోని చంటయ్యపల్లి గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ రమేష్ యాదవ్, సునంద ప్రేమించుకున్నారు. ఇద్దరి కులాలు వేరు కావటంతో అబ్బాయి తరపు వారు పెళ్లికి అంగీకరించలేదు. ఎలాగైనా రమేష్‌ని పెళ్లి చేసుకోవాలని ప్రియుడి ఇంటి ముందు సునంద 8 రోజులుగా దీక్ష చేసింది.
ఆ యువతికి న్యాయం చేయాలని దళిత కుల ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఎట్టకేలకు ఆ ప్రేమజంటకు వివాహం చేశారు. ఎనిమిది రోజులుగా ప్రియుడి ఇంటి ఎదుట చేస్తున్న ప్రియురాలి దీక్షకు ఈ వివాహంతో తెరపడినట్లయింది.
ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకుడు మంద కుమార్ వివాహం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, కులాంతర వివాహాలను ప్రభుత్వాలు ప్రోత్సహించాలన్నారు. ఈ జంటకు అన్ని విధాలా అండగా ఉంటామని, ప్రభుత్వం తరపున రావాల్సిన సహాయం కూడా త్వరగా అందేలా కృషి చేస్తామని తెలిపారు.
ఇదీ చూడండి: రాష్ట్రంలో 7 కేంద్రాల్లో డ్రైరన్.. వ్యాక్సినేషన్ ప్రక్రియ విజయవంతం