KTR Review meeting on Warangal: నగర ప్రజలకు రోజూ తాగునీళ్లు ఎందుకివ్వడం లేదు? ఏడాది నుంచి చెబుతున్నా ఎందుకు అమలు కావడం లేదు? కారణాలేమిటని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అధికారులను ప్రశ్నించారు. వచ్చే వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ఏం చేస్తారు? ఎలా చేస్తారు? సమగ్రమైన ప్రణాళిక రచించాలని ఆదేశించారు. నగరంలోని 66 డివిజన్లకు తాగునీళ్లు అందించేందుకు రూ.50 కోట్లతో వేసవి ప్రణాళిక రూపొందించినట్లు రాష్ట్ర అధికారులు వివరించారు. దీన్ని తక్షణం అమలు చేయాలని మంత్రి కేటీఆర్ సూచించారు.
నీళ్లు ఉన్నా ఎందుకు ఇవ్వడం లేదు?: ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని శాసనసభ సమావేశ మందిరంలో వరంగల్ నగరాభివృద్ధిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. వారం రోజులుగా వరంగల్‌లో నీటి సరఫరా నిలిచిపోయిన అంశం, భవిష్యతులో తలెత్తే ఇబ్బందులపై ప్రధానంగా చర్చించారు. నీళ్లు ఉన్నాయని, నీటి శుద్ధీకరణ కేంద్రాలున్నా.. రోజూ ఎందుకివ్వడం లేదని మంత్రి కేటీఆర్ అడిగారు. క్షేత్రస్థాయిలో పనిచేసేందుకు లైన్‌మెన్లు లేరని అధికారులు తెలిపారు. ‘న్యాక్’ సంస్థలో శిక్షణ పొందిన 130 మందిని ఒప్పంద పద్దతిన నియమించేందుకు ఆమోదం తెలిపారు.
స్మార్ట్‌సిటీ పథకం పనులు త్వరగా పూర్తి చేయాలి: నగరంలో నీటి సరఫరా మెరుగు పర్చేందుకు రాష్ట్ర స్థాయిలో అనుభవం కలిగిన విశ్రాంత ఇంజినీర్‌ను పంపించాలని రాష్ట్ర ఈఎన్‌సీని కోరారు. వరంగల్, హనుమకొండ బస్టాండ్ల ఆధునికీకరణ, ఇన్నర్ రింగురోడ్డు పనులు తక్షణం ప్రారంభించాలన్నారు. ముంపు తప్పించేందుకు నగరంలో ప్రధానమైన రెండు నాలాల్లో సమగ్రంగా పూడికతీత పనులు చేపట్టేందుకు డీపీఆర్ సిద్ధం చేయాలని మంత్రి కేటీఆర్ కోరారు. స్మార్ట్‌సిటీ పథకం పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. వైకుంఠ ధామాలు, సమీకృత మార్కెట్లు, సామాజిక భవనాలు, హరితహారం, నర్సరీలు, పట్టణ ప్రగతి, జీడబ్ల్యూఎంసీ ముఖ్యమైన పనుల పురోగతిని మంత్రి కేటీఆర్ సమీక్షించారు.
కాళోజీ కళాక్షేత్రం పనులు పూర్తి చేయాలన్నారు. సమావేశంలో రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్, రాష్ట్ర సంచాలకుడు డాక్టర్ సత్యనారాయణ, జిల్లాకు చెందిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్, వరంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు సిక్తా పట్నాయక్, బీ గోపి, బల్దియా కమిషనర్ ప్రావీణ్య, ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, అరూరి రమేష్, చల్లా ధర్మారెడ్డి, డాక్టర్ రాజయ్య, ‘కుడా’ ఛైర్మన్ సుందర్‌రాజ్‌తో పాటు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి: