Kaloji Health University MBBS and BDS Admissions Open : రాష్ట్రంలో వైద్య, దంత ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల ప్రవేశాలకు గానూ ఆన్‌లైన్ దరఖాస్తుల నమోదుకు కాళోజి నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా యూనివర్సిటీ పరిధిలోని ప్రభుత్వ ప్రైవేటు కళాశాలల్లో కన్వీనర్ కోటా సీట్లను భర్తీ చేయనున్నారు.
KNRUHS MBBS Admissions Notification 2023 : జాతీయ స్థాయి అర్హత పరీక్ష నీట్ 2023లో అర్హత సాధించిన అభ్యర్థులు నమోదు చేసుకోవాలని అధికారులు తెలిపారు. జులై 7 ఉదయం 8 గంటల నుంచి 14వ తేదీ సాయింత్రం 6 గంటల వరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నిర్దేశిత దరఖాస్తు పూర్తి చేయడంతో పాటు అభ్యర్థులు సంబంధిత ధ్రువపత్రాలను స్కాన్ చేసి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
KNRUHS MBBS Notification Released : ఆన్‌లైన్‌లో సమర్పించిన దరఖాస్తులు, ధ్రువపత్రాలను యూనివర్సిటీ పరిశీలించిన అనంతరం తుది మెరిట్ జాబితాను విడుదల చేస్తారు. మెరిట్ జాబితా విడుదల అనంతరం వెబ్ ఆప్షన్లకు యూనివర్సిటీ మరో ప్రకటన జారీ చేస్తుంది. తదనుగుణంగా అభ్యర్థులు ప్రాధాన్యత క్రమంలో ఆప్షన్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం వెబ్ ఆప్షన్లకు మరో నోటిఫికేషన్ వెలువడుతుంది. ప్రవేశాలకు సంబంధించి పూర్తి వివరాలకు కాళోజి విశ్వవిద్యాలయం వెబ్‌సైట్ www.knruhs.telangana.gov.inలో చూడాలని సూచించారు.
సింగరేణి ఉద్యోగుల పిల్లలకు 5 శాతం సీట్లు : మంచిర్యాల జిల్లా రామగుండలోని రామగుండం ప్రభుత్వ వైద్య కళాశాల (సిమ్స్)లో కన్వీనర్ కోటా ఎంబీబీఎస్ సీట్లలో 5 శాతం(7 సీట్లను) సింగరేణి ఉద్యోగుల పిల్లలకు రిజర్వ్ చేస్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగుల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ మేరకు శుభవార్త ప్రకటించారని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ట్విటర్‌లో పేర్కొన్నారు. ఇందులో మొత్తం 150 ఎంబీబీఎస్ సీట్లు ఉండగా, 23 సీట్లు (15 శాతం) ఆల్ ఇండియా కోటాకు వెళ్తాయి. మిగిలిన 127లో 5 శాతం సీట్లు ఉద్యోగుల పిల్లలకు రిజర్వ్ అవుతాయని వివరించారు. దీంతో పాటు సిమ్స్‌లో 50 పడకలను సింగరేణి ఉద్యోగులకు ప్రత్యేకంగా కేటాయిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది.
సిమ్స్‌గా పేరు మార్పు : రామగుండం ప్రభుత్వ వైద్య కళాశాల పేరును సింగరేణి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (సిమ్స్‌గా) మారుస్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఇవీ చదవండి: