బాల శాస్త్రవేత్తలను తలపించారు వరంగల్ వైజ్ఞానిక ప్రదర్శన నూతన ఆవిష్కరణలకు వేదికైంది. ప్రతిభను చాటేందుకు విద్యార్థులు పోటిపడ్డారు. మడికొండలోని తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలలో మూడు రోజులు పాటు జరిగిన రాష్ట్ర స్థాయి ప్రదర్శనలో వివిధ జిల్లాల నుంచి 650 మంది విద్యార్ధులు పాల్గొన్నారు. రోజూ వారీ జీవనంలో అవసరమైన పరికరాలను అతి తక్కువ ఖర్చుతో స్వయంగా ఎలా తయారుచేసుకోవాలో బాలబాలికలు ప్రయోగాత్మకంగా వివరించారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు.. సౌరశక్తితో నడిచే కార్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
త్రీడీ హాలోగ్రామ్ ద్వారా ఇస్తున్న ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంటుది. రైతులకు లాభసాటిగా ఉండే కలుపు తీసే యంత్రాలు, దుక్కిదున్ని విత్తనాలు వేసే పరికరాలను తయారు చేసి చూపించారు. నీటి వనరులు వృథా కాకుండా భూగర్బజలాలను పెంచే పద్దతులను ప్రదర్శించి అబ్బురపరిచారు. ఈ ప్రదర్శనలో ప్రతిభ కనబరించిన 72 మంది విద్యార్థులను విజేతలుగా నిర్ణయించారు.
ఈ నెల 14, 15 తేదీల్లో ఢిల్లీలో జరిగే జాతీయ స్ధాయి వైజ్ఞానిక ప్రదర్శనలో విద్యార్థులు పాల్గొననున్నారు.