నిత్యం వేలాదిమందితో రద్దీగా ఉండే ప్రయాణ ప్రాంగణాల్లోని హోటళ్లు, దుకాణాల్లో వ్యాపారం జోరుగా సాగేది. కరోనా వైరస్ రాకముందు ప్రయాణ ప్రాంగణాల్లో ఉన్న దుకాణాలను దక్కించుకునేందుకు పలువురు పోటీపడుతుండేవారు.. అలాంటిది కొవిడ్ ప్రభావంతో ప్రయాణికులు బస్సుల్లో ఎక్కకపోవడంతో ప్రాంగణాలు వెల వెలబోతున్నాయి. వారి రద్దీ తగ్గడంతో దుకాణాల్లో వ్యాపారమూ తగ్గింది. సంస్థకు అద్దె చెల్లించలేక యజమానులు వాటిని ఖాళీ చేస్తున్నారు.
పడిపోయిన ఆదాయం : కొవిడ్-19 కారణంగా ప్రయాణ ప్రాంగణాల్లోని పలు దుకాణాలు తెరుచుకోవడంలేదు. కొన్ని తెరిచినా వ్యాపారాలు నడవక ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి జిల్లాకు ప్రధానమైన హన్మకొండ బస్టాండులో ఎక్కువగా తినుబండారాలు విక్రయించే దుకాణాలున్నాయి. బస్సుల్లో ఎక్కడానికి, బయటి తిండి తినడానికి ప్రయాణికులు ఆసక్తి చూపకపోవడంతో వ్యాపారాలు ఎక్కువగా దెబ్బతిన్నాయి. దీంతో కొందరు ఆద్దెలు చెల్లించలేక దుకాణాలు ఖాళీ చేస్తున్నారు. ఒక హన్మకొండ బస్టాండులోనే దాదాపు 20కి పైగా దుకాణాలు మూతపడ్డాయి. రీజియన్ పరిధిలో మొత్తం 40కి పైగా దుకాణాలు అద్దెలు చెల్లించలేక తెరుచుకోవడంలేదు. కొవిడ్ కారణంగా రెండు నెలల పాటు దుకాణాలు పూర్తిగా మూసి వేశామని, ప్రస్తుతం తెరిచినా నష్టాలే వస్తున్నాయంటూ సంస్థ ఆదుకోవాలని వ్యాపారులు కోరుతున్నారు.
హన్మకొండ బస్టాండులో మాకు తినుబండారాల దుకాణం ఉంది. కరోనాకు ముందు రోజూ రూ.10 వేలకు పైగా అమ్మకాలు జరిగేవి. దాంతో సులువుగా అద్దె చెల్లించేవాళ్లం. ప్రస్తుతం ప్రయాణికులు లేక బస్టాండు వెలవెల బోతోంది. రోజుకు కనీసం రూ.2 వేల అమ్మకాలు జరగడం లేదు. కరెంటు బిల్లుకే సరిపోతోంది.
- అనుగం ప్రశాంత్, బేకరీ దుకాణదారుడు
- వరంగల్ రీజియన్‌లో ఆర్టీసీ డిపోలు 9
- ప్రయాణ ప్రాంగణాలు: 26
- మొత్తం దుకాణాలు: 498
- ప్రస్తుతం ఖాళీగా ఉన్నవి: 40
- వీటి ద్వారా ప్రతి నెలా సంస్థకు వచ్చే ఆదాయం:రూ.59.10 లక్షలు
- ప్రస్తుతం వస్తున్నది : రూ.26.00లక్షలు